‘నా జీవితమే విషాదంలా మిగిలిపోయింది’

20 Sep, 2019 17:32 IST|Sakshi

బ్రెసీలియా : మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న జంటను విధి విడదీసింది. గర్భవతి అయిన పెళ్లికూతురును హైబీపీ రూపంలో మృత్యువు కబళించింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన ఆమెకు సిజేరియన్‌ చేసిన వైద్యులు బిడ్డను మాత్రం కాపాడగలిగారు. ఈ హృదయవిదారక ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... బ్రెజిల్‌కు చెందిన జెస్సికా గుడెస్‌(30) నర్సుగా పనిచేస్తున్నారు. తన ప్రియుడు, ఫైర్‌ఫైటర్‌ అయిన ఫ్లావియో గోన్‌కాల్వెజ్‌(31)ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఇరు కుటుంబాల సమక్షంలో చర్చిలో ఉంగరాలు మార్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కాగా అప్పటికే జెస్సికా ఆరు నెలల గర్భవతి కావడం.. ప్రస్తుతం వారి పెళ్లి జరుగనుండటంతో ఫ్లావియో ఎంతో ఆనందంగా ఆమె రాకకోసం వివాహ వేదిక వద్ద ఎదురుచూడసాగాడు. 

కానీ ఇంతలోనే అక్కడికి చేరుకున్న జెస్సికా కజిన్‌... జెస్సికా ఆరోగ్యం క్షీణించిందని ఆమె బతికే అవకాశం లేదని చెప్పడంతో.. అతడు క్షణకాలం పాటు స్థానువైపోయాడు. వెంటనే తేరుకుని జెస్సికా ప్రయాణిస్తున్న కారు వద్దకు వెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే జెస్సికా బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. సీ-సెక్షన్‌ ద్వారా బిడ్డను బయటకు తీసి తనను కాపాడుకోవచ్చని సూచించారు. ఫ్లావియో ఇందుకు అంగీకరించడంతో బిడ్డను సురక్షితంగా బయటికి తీశారు. మరో రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక గర్భవతి అయిన జెస్సికా.. ప్రీక్లాంప్‌సియా కారణంగా హైబీపీ వల్ల మరణించిందని వైద్యులు తెలిపారు.

జీవితకాలపు విషాదం
ఓ తండ్రిగా బిడ్డను కాపాడుకోగలిగినా.. జెస్సికాను మాత్రం కోల్పోయినందుకు తాను దురదృష్టవంతుడినంటూ ఫ్లావియో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకుని.. జెస్సికా మృతదేహం వద్ద బోరున విలపించాడు. ఈ విషయం గురించి ఫ్లావియో మాట్లాడుతూ...‘ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, నా ప్రేమ నన్ను విడిచివెళ్లిపోయింది. స్త్రీలను ఎలా గౌరవించాలో...వారితో ఎలా మెలగాలో నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇప్పుడు అవన్నీ నా కూతురికి చెబుతాను. తనను ఎంతో జాగ్రత్తగా..తల్లి ఆశయాలకు అనుగుణంగా పెంచుతాను. అసలు ఇదంతా నమ్మలేకుండా ఉంది. అంతా సినిమాలోలా జరిగిపోయింది. ఇలాంటివి సినిమాలో జరిగితే ఏడ్వడం సహజం. కానీ థియేటర్‌ బయటికి వచ్చిన తర్వాత మనం సాధారణంగా విషాద సన్నివేశాలను మర్చిపోతాం. కానీ నా జీవితమే విషాదంలా మిగిలిపోతుందని అసలు ఊహించలేదు. జీవితకాలం తన ఙ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. తన ఉన్నత వ్యక్తిత్వానికి గుర్తుగా జెస్సికా అవయవాలను దానం చేయాలని మేము నిర్ణయించుకున్నాం అని తెలిపాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు