లక్షలమందిని ఆకట్టుకుంటున్న కవలలు!

24 Jan, 2016 06:46 IST|Sakshi

కవల పిల్లలు పుట్టడమే ఓ వింతగా కనిపిస్తుంది. నవజాత శిశువుల్ని చూసేందుకు కూడ అందరూ ఎంతో ఇష్టపడతారు. అటువంటిది ఆ పిల్లలు ఒకరికొకరు చేతులు పట్టుకొని మరీ పుట్టారంటే నిజంగా అది వింతే కదా! అందుకేనేమో ఇప్పుడు ఆ పసివాళ్ళ వీడియో ఫేస్ బుక్ యూజర్లను కట్టి పడేస్తోంది.

ఆంథియా జాక్సన్, రూస్ ఫోర్డ్ ల కు పుట్టిన నవజాత శిశువులు క్రిస్టినా, క్రిస్టియన్ లు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుట్టిన ఆ పిల్లలు తల్లిదండ్రులకే ఎంతో ఆశ్చర్యం కలిగించారు. అందుకేనేమో ఆ పిల్లల మురిపాన్ని అందరితో పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు వారిద్దరినీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోను కోటీ డెభ్భై లక్షలమంది చూశారు. అంతే కాదు లక్షా అరవై వేల మంది షేర్  కూడ చేశారు. అసలు తల్లి  గర్భంలో ఉండాల్సిన కన్నా 11 వారాల ముందే... అంటే  28 వారాలకే  పుట్టిన ఆ నవజాత శిశువులు ఒక్కొక్కరూ ఓ కేజీ మాత్రమే బరువున్నారు. అయితేనేం చేయీ చేయీ పట్టుకొని ముందుకు నడుద్దాం అన్నట్లుగా ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందర్నీఅకట్టుకుంటోంది.

వీడియోను అనేకమంది ఇష్టంగా చూస్తుండటంతో  తల్లి ఆంథియా.. ఆ కవల పిల్లల మరిన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో  పోస్ట్ చేసింది. అయితే దానికి వెనుక ఆతల్లి మనసు ఆరాటం ఉంది. తన పిల్లలు ప్రీమెట్యూర్డ్ గా పుట్టడంతో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ఇతర తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను ఆమె ఆశిస్తోంది. అటువంటి పిల్లల పెంపకంపై అనుభవజ్ఞులైనవారి నుంచి సలహాలను కూడ ఆ తల్లి కోరుకుంటోంది. '' ప్రిమెట్యూర్ కవలలు పుట్టడంతో నేను చాలా ఖంగారు పడ్డాను. అయితే వారు కాస్త స్థిరపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. తల్లిదండ్రులంతా ఇచ్చే కామెంట్లతో నాలో ధైర్యం కలుగుతుందని ఆశించాను.'' అంటూ ఆంథియా  ఫేస్ బుక్ లో తన కామెంట్ ను కూడ పోస్ట్ చేసింది. '' మా పిల్లలకు ఇంతటి ఆదరణ దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడ మంచి జరగాలని కోరుకుంటున్నాను''  అని కూడ తన భావాలను వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు