గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!

17 Aug, 2019 04:14 IST|Sakshi

సలహాదారులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్చలు

వాషింగ్టన్‌/స్టాక్‌హోమ్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్‌ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్‌ అయిన గ్రీన్‌లాండ్‌కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్‌లాండ్‌ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది.

ట్రంప్‌ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్‌లాండ్‌లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్‌ తిరస్కరించింది. గ్రీన్‌లాండ్‌లో విస్తారమైన హైడ్రోకార్బన్‌ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్‌ బయటపెట్టింది.

మేం అమ్మకానికి లేం: గ్రీన్‌లాండ్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్‌ ఖండించింది. ఈ విషయమై గ్రీన్‌లాండ్‌ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్‌లాండ్‌ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్‌లాండ్‌ మాజీ ప్రధాని లార్స్‌ రాముస్సేన్‌ మాట్లాడుతూ..‘ట్రంప్‌ ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్‌ కాదుగా’ అని వ్యాఖ్యానించారు.

మూడుదేశాల వలస పాలనలో..
గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్‌–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్‌ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్‌లాండ్‌లో మెజారిటీ ఇన్యుట్‌ జాతిప్రజలే. వీరంతా గ్రీన్‌లాండిక్‌ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌ 1953లో విలీనం చేసుకుంది. డానిష్‌ భాషను తప్పనిసరి చేసింది.

దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్‌లాండ్‌ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్‌లాండ్‌ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్‌ 1972లో హోంరూల్‌ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్‌లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్‌లాండ్‌కు దక్కాయి.

మరిన్ని వార్తలు