మోదీ అమెరికా సభకు అనుకోని అతిథి!

15 Sep, 2019 16:31 IST|Sakshi

టెక్సాస్‌ : భారత ప్రధాని​ నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) ‘హౌడీ, మోదీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 22న ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీనిని భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు.

హూస్టన్‌ నగరాన్ని ఇప్పటికే మోదీ మేనియా కమ్మేసింది. బాగున్నారా మోదీ అంటూ అక్కడ ఈ కార్యక్రమం కోసం ప్రవాస భారతీయులు వేచిచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఓ విదేశీ నాయకుడు పాల్గొనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకాబోవడం ఇదే మొదటిసారని, పోప్ ఫ్రాన్సిస్ మినహా విదేశీ నేతలు పాల్గొనే సభకు గతంలో ఈ స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని అంటున్నారు.

అయితే ఈ కార్యక్రమంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావొచ్చని తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి ట్రంప్‌తో సహా 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కూడా హజరుకానున్నారు. ‘హౌడీ, మోదీ’ కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక పేరుపొందిన ఇండియన్-అమెరికన్ ముస్లిం సంస్థ క్రియాశీలక మద్దతు అందిస్తోంది. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ (ఐఎంఏజీహెచ్) ప్రధాన వెల్‌కమ్ పార్టనర్‌లలో ఒకటిగా ఉంది. (చదవండి : సినిమా ఇంకా మిగిలే ఉంది: మోదీ)

మరిన్ని వార్తలు