డ్రైవింగ్‌ లైసెన్సు వదులుకున్న యువరాజు

11 Feb, 2019 10:42 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ యువరాజు ఫిలిప్‌(97) తన డ్రైవింగ్‌ లైసెన్సును స్వచ్ఛందంగా నోర్‌ఫోల్క్‌ పోలీసులకు సరెండర్‌ చేశారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. గత నెల 17న శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలిప్‌ నడుపుతున్న కారు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే సీటు బెల్టు లేకుండా డ్రైవ్‌ చేస్తూ ఆయన మీడియాకు చిక్కారు.

కాగా, తాజా నిర్ణయం నేపథ్యంలో కారు ప్రమాదం విచారణ నుంచి ఫిలిప్‌ తప్పించుకునే అవకాశముందని భావిస్తున్నారు. అన్నట్లు బ్రిటన్‌లో డ్రైవింగ్‌ లైసెన్సు పొందేందుకు గరిష్ట వయోపరిమితి లేదు. లైసెన్సు వదులుకున్న‍్పటికీ ప్రైవేటు రహదారులపై తన డ్రైవింగ్‌ చేయొచ్చని న్యాయనిపుణులు పేర్కొన్నారు.

ఏడవడం తప్పా ఏమీచేయలేను
ఇక నుంచి రోడ్లు భద్రంగా ఉంటాయని ప్రమాదంలో గాయపడిన ఎమ్మా ఫెయిర్‌వెదర్‌(46) అనే మహిళ వ్యాఖ్యానించారు. యువరాజు ఫిలిప్‌ ఇంత ఆలస్యంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్పగించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏడవడం తప్పా యువరాజును తానేమి చేయలేనని ఆవేదన చెందారు. ప్రమాదంలో ఆమె చేతికి గాయమైంది.

>
మరిన్ని వార్తలు