ఉద్యోగం వదిలేసిన యువరాజు

27 Jul, 2017 16:10 IST|Sakshi
ఉద్యోగం వదిలేసిన యువరాజు

లండన్‌(యూకే): రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైలట్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు బ్రిటన్‌ యువరాజు విలియమ్‌(35). గత రెండేళ్లుగా ఆయన కేంబ్రిడ్జి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ అంబులెన్స్‌ పైలెట్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జిగా పిలుచుకునే ప్రిన్స్‌ విలియమ్‌ బ్రిటన్‌ సింహాసనానికి తదుపరి వారసుడు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను తీసుకున్న ఎయిర్‌ అంబులెన్స్‌లో పనిచేయటం తీయని గుర్తుగా ప్రిన్స్‌ అభివర్ణించారు.

పైలట్‌గా తనకు తోటి ఉద్యోగులు ఇచ్చిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఉ‍ద్యోగిగా ఆయన్ను తోటి వారు పైలెట్‌ విలియమ్‌ వేల్స్‌గా పిలిచేవారు. తన బృందంలోని మరో నలుగురితో కలిసి రోజులో తొమ్మిదిన్నరగంటల డ్యూటీ చేశారు. ఈ సర్వీస్‌కు రోజుకు రెండువేలకు పైగా కాల్స్‌ వచ్చేవని సమాచారం. విధి నిర్వహణకు గాను ప్రిన్స్‌ అందుకున్న వేతనం మొత్తాన్ని ఎయిర్‌ అంబులెన్స్‌ చారిటీకే అందజేశారు.

కాగా, రాజకుటుంబ బాధ్యతల నిర్వహణకు వీలుగా వచ్చే సెప్టెంబర్‌లో లండన్‌లోని కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌కు మకాం మార్చనున్నారు. అక్కడే తమ పిల్లలు ప్రిన్స్‌ జార్జి, రాణి షార్లెట్‌ను జార్జి స్టార్ట్స్‌ స్కూల్‌లో చేర్పించనున్నారు. ప్రిన్స్‌ విలియమ్‌ కేట్‌ దంపతులు నాయనమ్మ, క్వీన్‌ ఎలిజబెత్‌-2, తాత ఫిలిప్‌ తరఫున బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు