కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ

19 May, 2020 13:13 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని  ప్రిన్స్టన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్‌ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్‌-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు)

ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్‌ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని ..  వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్‌ నాటికి మూడుకోట్ల డోస్‌లు!)

అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్‌ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం  చూపించలేదని తాము గర్తించినట్లు​ ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు.  ఫ్లూ జాతికి చెందిన వైరస్‌ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్‌ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్‌ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’)

బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్‌ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్‌ తెలిపారు. వాతావరణం వైరస్‌ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు