వామ్మో! ఖైదీల లాక్‌డౌన్‌ అంటే ఇలానా?

27 Apr, 2020 14:28 IST|Sakshi

వాషింగ్టన్‌: ఎల్‌ సాల్విడార్‌లో శుక్రవారం ఒక్క రోజే 22 మంది హత్యకు గురవడంతో దేశ అధ్యక్షుడు నయీబ్‌ బ్యూక్‌లే, ఇజాల్కోలోని జైల్లో 24 గంటల లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ జైల్లో ముఠా నాయకులు శిక్షలు అనుభవిస్తుండడం, వారి ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరగుతున్నాయని నయీబ్‌ భావించడమే అందుకు కారణం. ఆయన దేశ అధ్యక్షుడిగా గత జూన్‌ నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు 22 హత్యలు జరగడం ఇదే మొదటి సారి. 

ఈ నేపథ్యంలో జైల్లోని ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా వారందరిని ఒకే చోట నిర్బంధించడం ద్వారా లాక్‌డౌన్‌ అమలు చేయాలని నయీబ్‌ జైలు అధికారులను ఆదేశించారు. అయితే కరోనా వైరస్‌ విజంభిస్తోన్న నేపథ్యంలో ఎల్‌ సాల్విడార్‌ గత మార్చి నెల నుంచి దేశ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రజలంగా మాస్క్‌లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇజాల్కోలోని జైల్లో ఖైదీలను ఒకో చోట నిర్బంధించడం వల్ల సామాజిక దూరం నిబంధన గాలిలో కలసిపోయింది. పైగా ఊపిరాడనంతగా ఖైదీలను ఒకరిపై ఒకరు ఆనుకునేలా బంధించారు.

కొన్నేళ్ల క్రితం వరకు ఎల్‌ సాల్విడార్‌లో వీధి ముఠాల మధ్య కుమ్ములాటలు జరిగేవి. వాటిని మరాస్‌లని పిలిచేవారు. ఆ కుమ్ములాటల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. దేశాధ్యక్షుడి నయీబ్‌ వచ్చాకే కుమ్ములాటలు పూర్తిగా నిలిచి పోయాయి. కొన్ని నెలలుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. శుక్రవారం నాడు ఒక్క రోజే 22 మంది హత్య జరగడంతో ఆయన జైలు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు