వైరల్‌: చంటి పిల్లాడిని వీపు వెనకాల కట్టుకుని..

27 Sep, 2019 14:39 IST|Sakshi

జార్జియా : విద్యార్థిని తన చదువుమీద శ్రద్ధ పెట్టడానికి ఓ ప్రొఫెసర్‌ చేసిన సాయం నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జార్జియాకు చెందిన రమట సిస్సొకో సిస్సే.. లారెన్స్‌విల్లేలోని జార్జియా గ్విన్నెట్‌ కాలేజ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. బయోలజీ, అనాటమీ, సైకాలజీ ఆమె సబ్జెక్టులు. కొద్దిరోజుల క్రితం అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థిని(చంటిపిల్లాడి తల్లి) పిల్లాడితో క్లాస్‌ రూంలోకి వచ్చి కూర్చుంది. బేబీ సిట్టర్‌ దొరకని కారణంగా బాబుతో క్లాస్‌కు రావాల్సి వచ్చిందని తన పరిస్థితిని రమటకు వివరించింది. పిల్లాడిని ఒళ్లో పెట్టుకుని బోర్డుపై ఉన్న అంశాలను నోట్స్‌ రాసుకోవటం విద్యార్థినికి ఇబ్బందిగా మారింది.

ఇది గమనించిన రమట పిల్లాడిని తన వీపు వెనకాల కట్టుకుని, పాఠం చెప్పటం మొదలుపెట్టింది. ఇలా మూడు గంటల పాటు పిల్లాడిని వీపు వెనకాల ఉంచుకుని విద్యార్థులకు పాఠాలు చెప్పింది. రమట కూతురు ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా దానికి విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు 57వేల లైకులు సంపాదించుకుంది.

మరిన్ని వార్తలు