ప్రముఖ రచయిత దారుణ హత్య

12 Jun, 2018 13:11 IST|Sakshi

ఢాకా:  ప్రముఖ బంగ్లాదేశ్‌ రచయిత దారుణ హత్య​కు గురయ్యారు.  లౌకివాది, రచయిత,  ప్రచురణకర్త షాజహాన్ బచ్చూ (60)ను గుర్తు తెలియని వ్యక్తులు  సోమవారం సాయంత్రం కాల్చి చంపారు.  మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఆగంతకులు మున్సిన్‌గంజ్ జిల్లాలోని కాకాల్డిలో తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని బచ్చూ కుమార్తె  ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ధృవీకరించారు.   

ఢాకాలోని స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం ఇఫ్తార్‌ విందుముగిసిన అనంతరం స్నేహితుణ్ని కలుసుకునేందుకు పక్కనే ఉన్న మందుల దుకాణానికి వెళ్లారు. బైక్‌పై దూసుకొచ్చిన అయిదుగురు వ్యక్తులు షాపులోంచి బయటకు లాక్కొచ్చి మరీ బచ్చూపై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులకు ముందు  నాటు బాంబు విసిరి భయానక వాతావరణం సృష్టించారంటూ  సీనియర్ సూపరింటెండెంట్  ప్రకటించినట్టుగా ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.

మరోవైపు హత్యకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ, ఇస్లామిస్ట్ తీవ్రవాదుల దాడిగా కౌంటర్ టెర్రరిజం విభాగం పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బికాస ప్రకాషిణి అనే ప్రచురణ సంస్థ ఆయన నడుపుతున్న షాజహాన​ లౌకికవాదిగా ప్రతీతి పొందారు.  బంగ్లాదేశ్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడిగా పనిచేశారు. గతంలో తీవ్రవాద గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.

కాగా బంగ్లాదేశ్‌లో సెక్యులర్‌ రచయితలు, బ్లాగర్‌, రచయితలపై గతంలో కూడా  దాడులు, హత్యలు, జరిగాయి. ఫిబ్రవరి 26, 2015 న ఢాకాలో నాస్తికుడు రచయిత, బ్లాగర్ అవిజిత్ రాయ్‌ ఇస్లామిస్ట్ మిలిటెంట్ల చేతిలో హత్యకు గురయ్యారు. అదే ఏడాది అక్టోబర్‌లో అవిజిత్‌ పబ్లిషర్‌ ఫేజల్‌ దిపాన్‌ను కూడా  చంపేశారు.

మరిన్ని వార్తలు