యూఎన్‌ఓ వద్ద మోదీకి వ్యతిరేకంగా నిరసనలు

28 Sep, 2019 19:45 IST|Sakshi

న్యూయార్క్‌: కశ్మీర్‌ నిరసన సెగ అగ్రరాజ్యం అమెరికాను తాకింది. ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఐరాస ఎదురుగా వందలమంది నిరసన వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు తిరిగి స్వతంత్రం ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. వీరిలో అమెరికాలో స్థిరపడిన కశ్మీరీలు, దక్షిణాసియాకు చెందిన మరికొందరు పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారత్‌లో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతోందని, కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, రైతుల ఆత్మహత్యలు, మైనార్టీలు, గిరిజనల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న వారంత తమవెంట ఫ్లెక్సీలు, బ్యానెర్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఐరాస సభలో మోదీ ప్రసంగిస్తున్నంత సేపు వారి నిరసన కొనసాగింది. అనంతరం మీడియా సమావేశంలో ర్యాలీలో ప్రతినిధులు మాట్లాడారు. మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. మోదీ గోబ్యాక్‌ అంటూ నినదించారు.

కాగా హూస్టన్‌ నగరంలో ఇటీవల నిర్వహించిన హౌడీమోదీ కార్యక్రమానికి కూడా మోదీకి నిరసన సెగ ఎదురైన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట  మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయాడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఈ హూస్టన్ సభాస్థలం వెలుపల నిరసన తెలిపారు.  'స్టాండ్ విత్ కశ్మీర్', 'కశ్మీర్ ఈజ్ బ్లీడింగ్' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గులాం నబీ అనే నిరసనకారుడు అక్కడ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ అంతటా బలగాలు మోహరించి జనజీవితాన్ని నియంత్రించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు, చిన్నారులు చిక్కుకుపోయారని అన్నారు. డాలస్ నుంచి వచ్చిన షాకత్ అనే నిరసనకారుడు ‘కశ్మీర్ కోల్పోయిన స్వతంత్రత తిరిగి రావాల’న్నారు.

మరిన్ని వార్తలు