కర్ఫ్యూను ధిక్కరించి..

31 May, 2020 03:54 IST|Sakshi
షికాగో అవెన్యూలో భవనాలు, కార్లకు నిప్పు

నల్లజాతీయుడి లాకప్‌డెత్‌పై అమెరికాలో విస్తరిస్తున్న నిరసనలు

మినియాపొలిస్‌: జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంతో భగ్గుమన్న నిరసనలు మినియాపొలిస్‌ నుంచి అమెరికాలోని ఇతర నగరాలకు వ్యాపించాయి. కోవిడ్‌ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపొలిస్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మినియాపొలిస్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను నిరసనకారులు చుట్టుముట్టి పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

నగరంలో పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రెస్టారెంట్, బ్యాంకు, మరో కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. భద్రతా కారణాల రీత్యా అగ్ని మాపక సిబ్బంది అక్కడికి రాకపోవడంతో గంటలపాటు మంటలు కొనసాగాయి. డెట్రాయిట్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, అట్లాంటాలో ఆందోళనకారులు పోలీసుకార్లకు నిప్పంటించారు. న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్‌ నగరాల్లో భారీగా ప్రదర్శనలు జరిగాయి.

ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  దొంగ నోట్ల చెలామణీకి యత్నించాడన్న ఆరోపణలపై ఫ్లాయిడ్‌ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేడీలు వేసిన తర్వాత ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్‌ చౌవిన్‌ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో, చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది.

అట్లాంటాలో నినాదాలిస్తున్న ఆందోళనకారులు

మరిన్ని వార్తలు