ఉద్యమ నినాదం.. 8.46

5 Jun, 2020 04:19 IST|Sakshi
బోస్టన్‌లో నేలపై పడుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులు

అమెరికాలో వినూత్న నిరసన

జాతి వివక్షపై పోరుకు 210 కోట్లు: గూగుల్‌

మినియాపోలిస్‌/వాషింగ్టన్‌: అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్‌ పోలీసు అధికారి డెరెక్‌ చెవెన్‌ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్‌లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో మైనపు వత్తులు పెట్టుకుని అంతే సమయం మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్‌ చానళ్లు వయాకామ్‌సీబీఎస్‌ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది.  

గూగుల్‌ సీఈఓ నివాళి
8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం వహించడం ద్వారా ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్‌ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన్నారు. జాతి అసమానతల నివారణ కోసం పనిచేస్తున్న సంస్థలకు కోటీ ఇరవై లక్షల డాలర్ల నగదు సాయం అందిస్తామని, సంస్థలు జాతి వివక్షపై పోరాడేందుకు, కీలకమైన సమాచారం అందించేందుకు 2.5 కోట్ల డాలర్ల విలువైన ప్రకటనలను గ్రాంట్‌ రూపంలో ఇస్తామని పిచాయ్‌ వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సెంటర్‌ ఫర్‌ పోలీసింగ్‌ ఈక్విటీ అండ్‌ ఈక్వల్‌ జస్టిస్‌ ఇనిషియేటివ్‌కు పది లక్షల డాలర్ల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం తరువాత అమెరికా వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు    బరాక్‌ ఒబామా రాజకీయంగా చురుకుగా మారారు. నవంబర్‌లో అధ్యక్ష     ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒబామా మరోసారి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూండటం గమనార్హం. ‘సమాజంలోని      సమస్యలను ఎత్తి చూపడం ద్వారా అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన చట్టాలు, పరిష్కార మార్గాలు      సూచించాలి’’అని అన్నారు.

గాంధీ విగ్రహం ధ్వంసం
అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్‌ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్‌ జుస్టర్‌ క్షమాపణలు కోరారు.

ఫ్లాయిడ్‌కు కరోనా?
ఫ్లాయిడ్‌ రెండు నెలల క్రితం కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. హెన్నిపిన్‌ కౌంటీ మెడికల్‌ ఎగ్జామినర్‌ చేసిన శవపరీక్ష నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. మినసోటా ఆరోగ్య శాఖ అధికారులు ఫ్లాయిడ్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారని కరోనా సోకినట్లు ఏప్రిల్‌ 3న నిర్ధారించారని ఆండ్రూ బేకర్‌ అనే ప్రఖ్యాత మెడికల్‌ ఎగ్జామినర్‌ తెలిపినట్లు కథనం తెలిపింది. అయితే అతడి మరణానికి కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్లాయిడ్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారం లేదని కుటుంబసభ్యుల కోరిక మేరకు శవపరీక్ష నిర్వహించిన మైకెల్‌ బాడెన్‌ తెలిపారు. అంత్యక్రియల నిర్వాహకులకు ఈ విషయం చెప్పలేదని దీంతో చాలామంది ఇప్పుడు కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా