సెల్ఫీ పిచ్చి.. మానసిక రోగమే!

7 Feb, 2018 22:09 IST|Sakshi

సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ.. ఈ మధ్య ఎక్కడ చూసినా సెల్ఫీల పిచ్చి పట్టుకుంది అందరికి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు సెల్ఫీ దిగడం సోషల్‌ మీడియాలో పెట్టడం. చిన్నపెద్ద అనే తేడా లేదు.. సందర్భం ఏదైనా సెల్ఫీ తీసుకోవడం మాత్రం సర్వసాధారణామైంది. ఎప్పుడో ఒకసారి దిగితే ఫర్వాలేదు కానీ, కొంతమంది అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటారు. ఇలాంటి వారిని మానసిక రోగులుగా భావిస్తామంటున్నారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు మార్క్ డి గ్రిఫిత్స్, జనార్థనన్‌ బాలకృష్ణన్. అతిగా సెల్ఫీలు దిగే వారిని ‘సెల్ఫిటీస్‌’గా 2014లో ఓ వార్తా పత్రికా పేర్కొంది. 

ఆ పదంలో నిజాన్ని నిర్ధారించడానికి, అలాంటి స్వభావం ఉన్న వారిని గుర్తించడానికి 400 మంది భారతీయుల ప్రవర్తనను వీరు పరిశీలించారు. ‘సెల్ఫిటీస్‌ బిహేవియర్‌ స్కేల్’  ద్వారా మూడు రకాలుగా విభజించారు. మొదటి రకం వారు రోజులో 3 సెల్ఫీలు దిగుతారు. కానీ, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయరు. రెండో రకం వారు సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. మూడో రకం దారుణం రోజులో ప్రతి చిన్న సందర్భానికి సెల్ఫీ దిగి అదే పనిగా పోస్ట్‌ చేస్తారు. 

ఒక రోజులో వీరు కనీసం 6 సెల్ఫీలు దిగి, పోస్ట్‌ చేస్తారు. ఇలా అతిగా సెల్ఫీలు దిగే వారు మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని సైక్రియాట్రిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. వీరిలో కొంత మందిని ఈ విషయంపై ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తమకు తాము చాలా పాపులర్‌గా భావించుకుంటామన్నారు. సెల్ఫీ దిగకుండా, పోస్ట్‌ చేయకుండా ఉంటే తాము తమ తోటి వారితో సంబంధాలను కోల్పోయినట్లు భావిస్తామని మరికొంత మంది సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఈ పరిస్థితిలో ఉన్నవారు ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతుంటారు. వారి చుట్టుపక్కల ఉన్నవారితో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి వ్యసనంలా మారుతుంద’ని బాలకృష్ణన్ అన్నారు. 


 

మరిన్ని వార్తలు