పీటీఐ ప్రధాని అభ్యర్థిగా ఇమ్రాన్‌ ఖాన్‌

7 Aug, 2018 03:03 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్లమెంటరీ కమిటీ ఇమ్రాన్‌ ఖాన్‌ను తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. పాక్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీటీఐ అత్యధిక సీట్లు గెల్చుకోవడం తెల్సిందే. పీటీఐ పార్లమెంటరీ కమిటీ ఇస్లామాబాద్‌లో సోమవారం సమావేశమైంది. పార్టీ పార్లమెంటరీ లీడర్‌గా ఇమ్రాన్‌ను పీటీఐ‡ నేత ఖురేషీ ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.

తనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఇమ్రాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రమాణ స్వీకార తేదీ వెల్లడి కాకపోయినా.. పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీన ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. పాక్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుండగా, అందులో 272 మందిని నేరుగా ఎన్నుకుంటారు. అధికారంలోకి రావాలంటే ఏదైనా పార్టీ కనీసం 172 సీట్లు గెలవాలి. 116 సీట్లతో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమకు 174 మంది సభ్యుల మద్దతు ఉందని పీటీఐ తెలిపింది. 

>
మరిన్ని వార్తలు