నేడు ప్రధాని అభ్యర్థిగా  ఇమ్రాన్‌ను ఎన్నుకోనున్న పీటీఐ 

6 Aug, 2018 02:41 IST|Sakshi

కేంద్ర కేబినెట్‌లో 15–20 మందికి చోటు  

ఇస్లామాబాద్‌: మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌(65)ను పాక్‌ ప్రధాని అభ్యర్థిగా పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నేడు ఎన్నుకోనుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో 15 నుంచి 20 మంది సభ్యులతో మంత్రిమండలి ఏర్పాటు కానుంది. ఈ విషయమై పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌధరీ జియో చానెల్‌తో మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌ లో సోమవారం పీటీఐ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ భేటీలో ఇమ్రాన్‌ ఖాన్‌ను పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం స్వతంత్ర సభ్యులతో కలసి పీటీఐ బలం 125 సీట్లకు చేరుకుందనీ, ఇతర మిత్రపక్షాలు, రిజర్వ్‌డ్‌ సీట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే జాతీయ అసెంబ్లీలో తమకు 174 సీట్ల మెజారిటీ ఉందని వెల్లడించారు. తాజాగా బీఎన్‌పీఎం(3) ఇచ్చిన మద్దతుతో మొత్తం సీట్ల సంఖ్య 177కు చేరుకుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 172 సీట్లు అవసరమన్నారు. మరోవైపు ప్రతిపక్ష పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)లు ప్రధాని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించాయి. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారత ఖైదీల్ని ఇమ్రాన్‌ విడుదల చేసే అవకాశముందని పీటీఐ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు