పని చేయలేదని పనిపట్టారు..!

11 Mar, 2018 01:23 IST|Sakshi

ప్రజాప్రతినిధి అంటే మన కోసం మనం ఎన్నుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కోసం పనిచేయకపోతే.. తన పనితీరు మనకు నచ్చకపోతే.. ఏం చేస్తారు.. ఆ.. ఏముంది చేసేందుకు.. మన ఖర్మ అని నోరు మూసుకుని కూర్చోవడం తప్ప.. అనుకుంటాం కదా..! కానీ బొలీవియాలోని బ్యూనవెంచురా అనే మున్సిపాలిటీలో ప్రజలు మాత్రం అలా చేతులు ముడుచుకుని కూర్చోరు.

ప్రజా సేవలో కాస్త అలసత్వం ప్రదర్శించినా నిలదీ యడమే కాదు.. వారికి తెలిసొచ్చేలా బుద్ధి చెబుతారు. అక్కడి మేయర్‌ జావియర్‌ డెల్గడో తన విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు తగిన శాస్తి చేశారు అక్కడి ప్రజలు. ఆ మేయర్‌ కాలును ఓ స్తంభానికి గంటపాటు కట్టేశారు. దీనివల్ల వారి అసంతృప్తి సదరు ప్రజాప్రతినిధికి తెలిసి మరుసటి రోజు నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడని వారి ఆశ.

అక్కడ ప్రభుత్వం నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వెళ్లిన జావియర్‌కు అక్కడి జనం షాక్‌ ఇచ్చారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని, ప్రజలకు సేవ చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని జావియర్‌ చెబుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే తమ ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలతో అసంతృప్తి కనుక ఉంటే ప్రజలు ఇలా శిక్ష విధించవచ్చని అక్కడి రాజ్యాంగం కూడా హక్కును ప్రసాదించింది.

>
మరిన్ని వార్తలు