ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం

14 Jan, 2020 05:37 IST|Sakshi

ఇరాన్‌ ప్రకటన

ఖతార్‌ ఎమిర్‌తో ఇరాన్‌ అధ్యక్షుడి భేటీ

టెహ్రాన్‌: అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని ఇరాన్‌ ప్రకటించింది. శాంతి నెలకొనేందుకు ముందు ఉద్రిక్తతలు తగ్గడం అవసరమేనని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. అయితే, అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానిల మధ్య టెహ్రాన్‌లో సోమవారం చర్చలు జరిగాయి. ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించాలంటే ఉద్రిక్తతలు తొలగాలని, చర్చ లు జరగాలని భావిస్తున్నట్లు ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి.

అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం’ అని ఖతార్‌ ఎమిర్‌ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రాంత రక్షణను దృష్టిలో పెట్టుకుని సంబంధిత వర్గాలతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించాం’ అని ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ పేర్కొన్నారు. ఖతార్‌ అమెరికాకు, ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్‌ ఖతార్‌లోనే ఉంది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రితోనూ రౌహానీ సమావేశమయ్యారు. ఇరాన్, యూఎస్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇటీవల పాకిస్తాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో చర్చలకే అధ్యక్షుడు ట్రంప్‌ మొగ్గు చూపుతున్నారని అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ వ్యాఖ్యానించారు.

రాయబారి అరెస్ట్‌పై బ్రిటన్‌ సీరియస్‌
టెహ్రాన్‌లో తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడంపై బ్రిటన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా సోమవారం బ్రిటన్‌లోని ఇరాన్‌ రాయబారిని పిలిపించి, సంజాయిషీ కోరింది. తమ రాయబారిని అదుపులోకి తీసుకోవడం దౌత్య నిబంధనల ఉల్లంఘన అని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ విమాన ప్రమాద మృతులకు నివాళి అర్పించేందుకు ఆమిర్‌ కబిర్‌ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్‌లోని బ్రిటన్‌ రాయబారి రాబ్‌ మెక్‌ కెయిర్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాను నిరసనల్లో పాల్గనలేదని, నివాళి కార్యక్రమంలో పాల్గొనేందుకే వెళ్లానని ఆదివారం రాబ్‌ మెక్‌కెయిర్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఉక్రెయిన్‌ విమానాన్ని కూల్చిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించలేదని ఇరాన్‌ ప్రకటించింది.
 

>
మరిన్ని వార్తలు