ఖతార్‌ కీలక నిర్ణయం : భారతీయులకు గుడ్‌న్యూస్‌

26 Oct, 2017 11:54 IST|Sakshi

దోహ : వరల్డ్‌ కప్‌ 2022ను నిర్వహించబోతున్న ఖతార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వనున్నట్టు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇదివరకే ఖతార్‌ను హెచ్చరించింది. కార్మికుల హక్కుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నవంబర్‌లోగా చెప్పాలని గడువు విధించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ)తో సమావేశం ఏర్పాటు కావడం కంటే ఒక్కరోజు ముందస్తుగానే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో పొట్టకూటి కోసం ఖతార్‌కు వెళ్లిన భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ఖతార్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫడరేషన్‌(ఐసీటీయూ) స్వాగతించింది.  

కనీస వేతన ఒప్పందాలను విదేశీ అధికారుల సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూయిమి ప్రకటించారు. ఈ కనీస వేతనం కార్మికుల కనీస అవసరాలను సమకూర్చేలా నిర్ణయించామని మంత్రి తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఈ కనీస వేతనాన్ని అమలు చేయనున్నారో మంత్రి తెలుపలేదు. ఖతార్‌లో వలస కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ దశాబ్దాలుగా 'ఖఫాలా' అనే కార్మిక విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం వలస కార్మికులెవరైనా ఉద్యోగం మానేయాలంటే ముందు యజమాని అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, దేశం వదిలి వెళ్లాలన్నా యజమాని పర్మిషన్ తప్పనిసరి. అయితే, గతేడాది డిసెంబర్‌లో 'ఖఫాలా' విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది.

మరిన్ని వార్తలు