పార్లమెంటు సస్పెన్షన్‌ ఎత్తివేత

2 Nov, 2018 02:54 IST|Sakshi
శ్రీలంక పార్లమెంటు భవనం

ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన

విశ్వాసపరీక్షలో గెలుపు మాదే: విక్రమసింఘే

కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్‌ ప్రకారమే సోమవారమైన నవంబర్‌ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్‌ ప్రేమజయంత అన్నారు.

ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని  పదవీచ్యుత ప్రధాని రణిల్‌ విక్రమసింఘే  ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్‌ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్‌ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి.

ఫిరాయింపులు పూర్తయినట్లేనా?
వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది.

దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

మరిన్ని వార్తలు