టాప్‌ టెన్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు..!

10 May, 2019 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్‌ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్‌ 20లో కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్‌, కెనడాలోని బిల్లీ బిషప్‌ విమానాశ్రయాలు నిలిచాయి. ఎయిర్‌హెల్ప్‌ అనే సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. విమాన ప్రయాణికుల హక్కులు, పరిహారాలు, కేసులు, విమానాల ఆలస్యం, రద్దు తదితర అంశాలపై ఎయిర్‌హెల్ప్‌ సేవలందిస్తోంది.

ఖతార్‌ రెండోసారి..
ఇక ఎయిర్‌లైన్స్‌ సేవల్లో కూడా ఖతార్‌ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిరోమెక్సికో, ఎస్‌ఏఎస్‌ స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్‌ ఎయిర్‌లైన్స్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల్లో ర్యానైర్‌ ఎయిర్‌వేస్‌, కొరియన్‌ ఎయిర్‌, కువైట్‌ ఎయిర్‌వేస్‌, యూకేకు చెందిన ఈస్ట్‌ జెట్‌, థామస్‌ కుక్‌ టాప్‌ ర్యాంకుల్లో నిలిచాయి.

టాప్‌ టెన్‌ ఎయిర్‌పోర్టులు..
1. హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - ఖతర్‌
2. టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - జపాన్‌
3. ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - గ్రీస్‌
4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్‌
5. డాన్సిక్‌ లెచ్‌ వాటెసా​ ఎయిర్‌పోర్టు - పోలెండ్‌
6. మాస్కో షెరెమ్‌త్యేవో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - రష్యా
7. సింగపూర్‌ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్‌
8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా
9. టెనెరిఫ్‌ నార్త్‌ ఎయిర్‌పోర్టు - స్పెయిన్‌
10. విరాకోపోస్‌/కాంపినాస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్‌

>
మరిన్ని వార్తలు