పాట పాడాడు.. జైలుశిక్ష తగ్గించారు!

31 Mar, 2018 12:08 IST|Sakshi
అమెరికన్‌ ర్యాపర్‌ డీమ్‌ఎక్స్‌

న్యూయార్క్‌ : శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు వివిధ మార్గాలు అనుసరిస్తారు. కొందరు అబద్ధాలు చెప్తారు. మరికొందరు సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ తన పాటతో జడ్జిని మెస్మరైజ్‌ చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూశాడు. ర్యాపర్ డీఎమ్‌ఎక్స్ గా ప్రసిద్ధి చెందిన ఎర్ల్‌ సిమ్మన్స్‌ పన్ను ఎగవేత కేసులో కోర్టు ముందు హాజరయ్యాడు. 1.7 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగ్గొట్టిన సిమ్మన్స్‌ను రక్షించేందుకు అతని లాయర్‌ ముర్రే రిచ్‌మన్‌ కూడా సిమ్మన్స్‌ మాదిరిగానే కోర్టులో విచిత్రంగా ప్రవర్తించాడు. సిమ్మన్స్‌ జీవితంలోని కష్టనష్టాలు, అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపే ‘స్లిప్పిన్‌’  అనే హిట్‌ సాంగ్‌ను ప్లే చేస్తూ జడ్జిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘సిమ్మన్స్‌ జీవితం గురించి నేను విన్నాను. అతను చాలా కష్టాలు అనుభవించాడు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలదొక్కుకున్నాడు. సిమ్మన్స్‌ ఇప్పటికే సుమారు 30సార్లు అరెస్టయ్యాడు. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అతనిలో మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో అతను కుంగిపోయాడు. తన 15 మంది పిల్లలకు అతడి అవసరం ఉంది. కాబట్టి అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ వాదించాడు.

ప్రాసిక్యూటర్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. పన్ను ఎగవేత కేసులో సిమ్మన్స్‌ ఐదు సంవత్సరాల శిక్ష ఎదుర్కోక తప్పదు అని వాదించాడు. వాద ప్రతివాదనలు విన్న జడ్జి ఇచ్చిన తీర్పు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సిమ్మన్స్‌ చాలా మంచివాడు. తన పాటతో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. కానీ తనకు తానే పెద్ద శత్రువు’  అని పేర్కొంటూ.. ఏడాదిపాటు జైలు శిక్ష, 2.3 మిలియన్‌ డాలర్ల(రూ. 15 కోట్లు) జరిమానాతో సరిపెట్టాడు.  

మరిన్ని వార్తలు