ఎరక్కపోయి ఇరుక్కుని! 

3 Mar, 2019 01:14 IST|Sakshi

అనగనగా ఒక ఎలుక. ఎలుకంటే ఎలుకలా ఉండదు. బాగా బలిసిన పందికొక్కులా కనిపిస్తుంది. చలికాలం వస్తే చాలు ఇలాంటి జంతువులన్నీ కొవ్వెక్కి బాగా లావెక్కిపోతాయి. జర్మనీలోని బెన్షీమ్‌ పట్టణం దాని నివాసం. ఓ రోజు బాగా తిన్న ఆ ఎలుక కాసేపు వాకింగ్‌కు బయల్దేరింది. రోడ్డు మీద ఉన్న మ్యాన్‌ హోల్‌ పైకప్పు కన్నంలో ఎరక్కపోయి ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక.. మ్యాన్‌హోల్‌లోకి దిగలేక అవస్థలు పడింది. ఎటూ కదల్లేక అరవసాగింది. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న స్థానికుడైన నాట్, అతని భార్య జూలియానాలు.. ఆ ఎలుక పడుతున్న అవస్థలు చూసి ఆగారు.. ఆ ఎలుకను నెమ్మదిగా పైకి లాగడానికి జూలియానా ప్రయత్నించింది. అసలే ఇరుక్కుపోయిన బాధలో ఉన్న ఆ ఎలుక గట్టిగా అరుస్తూ ఆమె చేతికున్న లెదర్‌ గ్లౌజులను కొరికేసిందట.

ఇక లాభం లేదనుకుని ఎలుకల్ని పట్టే నిపుణులకు వాళ్లు ఫోన్‌ చేశారు. అగ్నిమాపక దళ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆ ఎలుకను రక్షించేందుకు ఏకంగా 9 మంది అధికారులు వచ్చారు. జంతువుల్ని కాపాడే నిపుణుడు షేర్‌ కూడా వారికి సాయం చేశారు. తమ దగ్గరున్న పరికరాల సాయంతో ఎలుకను గట్టిగా కిందకి నెట్టారు. ఆ మూత నుంచి బయటపడిన ఎలుక.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. మమూలుగా అయితే ఇలాంటి రక్షణ చర్యలకు అగ్నిమాపక సిబ్బంది 120 జర్మనీ యూరోల డబ్బు వసూలు చేస్తారు. కానీ ఆ ఎలుక ఎవరికీ చెందదు కాబట్టి జంతు ప్రేమతోనే ఉచితంగానే కాపాడారు. నాట్‌ ఇద్దరు కుమార్తెలు మ్యాన్‌హోల్‌ను తవ్వి ఈ ఎలుకను పట్టే ప్రక్రియ అంతా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేసరికి అవి వైరల్‌గా మారాయి.  

మరిన్ని వార్తలు