అమెరికాలో ‘రవి’ కిరణం

5 Jun, 2020 08:14 IST|Sakshi

కీలక బాధ్యతల్లో తెలుగు ఐఏఎస్‌ అధికారి రవి కోత

సాక్షి, న్యూఢిల్లీ, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అసోం కేడర్‌ 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్‌ మినిస్టర్‌ (అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యాధికారి)గా నియమితులయ్యారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో సంయుక్త కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.రవి రెండేళ్లుగా 15వ ఆర్థిక సంఘంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
(అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు షురూ!) 

రైతు కుటుంబం నుంచి..
కోత రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం. రైతు కుటుంబానికి చెందిన ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సీ, ఏజీ ఎమ్మెస్సీ చేశారు. న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆగ్రోనమీలో పీహెచ్‌డీ చేశారు. తొలుత ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన ఆయన రెండో ప్రయత్నంలో 1992లో ఐఏఎస్‌ పరీక్షలో 48వ ర్యాంకు తెచ్చుకున్నారు. 1993 బ్యాచ్‌ అసోం కేడర్‌ అధికారిగా ఐఏఎస్‌ ప్రస్థానం ప్రారంభించారు. అసోంలో అతి క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించారు. బోడో ఉగ్రవాద ప్రభావిత కోక్రాఝర్‌ జిల్లాలోని గోసాయిగాం సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. బోడో, సంథాల్‌ తెగల మధ్య జాతి అల్లర్లలో లక్షన్నర ప్రజల్ని రిలీఫ్‌ క్యాంపుల్లో ఉంచి ఉగ్రవాదుల నుంచి కాపాడారు. (ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు)

తర్వాత బ్రహ్మపుత్ర నదీ వరదలతో సతమతమవుతున్న ఎగువ అస్సాం మూడు జిల్లాల్లో (గ్రోలాఘాట్, శివసాగర్, జోర్హాట్‌)  కలెక్టర్‌గా పనిచేసి  ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. గోలాఘాట్‌ నుంచి 2000 సంవ్సతరంలో బదిలీ అయినప్పుడు ప్రజలు అడ్డుకోవడం, ఆయననే కొనసాగించాలని జిల్లా బంద్‌ ప్రకటించడం అక్కడి ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనం. 15వ ఆర్థిక సంఘం గత డిసెంబర్‌లో ఏపీలో పర్యటించిన సమయంలో ఆయన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని వార్తలు