శత్రువులతో ఇక భీకర యుద్ధమే: చైనా వార్నింగ్‌

20 Mar, 2018 16:23 IST|Sakshi

బీజింగ్‌ : తన భూభాగంలోని ఒక్క ఇంచు స్థలాన్ని కూడా వదులుకోవడానికి చైనా సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ పేర్కొన్నారు. తమ శత్రువులతో భీకర యుద్ధాలు చేసేందుకూ తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.  ‘మన భూభాగంలోని ఒక అంగుళాన్ని కూడా చైనా వదులుకోబోదు. శత్రువులతో భీకరమైన యుద్ధాలు చేసేందుకు మనం సంకల్పించాం’ అని చైనా పార్లమెంటు అయిన నేషనల్‌ పీపుల్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల ముగింపు సందర్భంగా జీ పేర్కొన్నారు.

చైనా నుంచి తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ వీడిపోతాయేమోనన్న భయం ఇటీవల డ్రాగన్‌లో పెరిగిపోతోంది. తైవాన్‌ స్వయం పాలిత ద్వీప కాగా, ఈ ప్రాంతాన్ని చైనాలో ఐక్యం చేస్తామని కమ్యూనిస్టు నాయకత్వం చెప్తూ వస్తోంది. ఇక హాంగ్‌కాంగ్‌లో చైనా పెత్తనంపై ఆగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌ ఒకప్పటి బ్రిటిష్‌ పాలన ప్రాంతం. ప్రస్తుతం చైనా ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉన్న హాంగ్‌కాంగ్‌ ప్రజలు చైనా నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాంగ్‌కాంగ్‌ ఆధిపత్యం నుంచి విముక్తి కావాలని హాంగ్‌కాంగ్‌ ప్రజలు గట్టిగాకోరుకుంటున్నారు. ఇక శత్రువులతో భీకర యుద్ధాలకు సిద్ధమంటూ పేర్కొనడం ద్వారా పరోక్షంగా భారత్‌కు కూడా జీ సంకేతాలు పంపించారని నిపుణులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు