‘ఒకే దెబ్బతో అమెరికా యుద్ధనౌకను ముంచుతాం’

23 Apr, 2017 13:35 IST|Sakshi
‘ఒకే దెబ్బతో అమెరికా యుద్ధనౌకను ముంచుతాం’

సియోల్‌: ఉత్తర కొరియా అమెరికాతో కయ్యానికి కాలు దువ్వింది. అమెరికా యుద్ధ నౌకను ముంచిపారేస్తామని నేరుగా హెచ్చరించింది. తమముందు బల ప్రదర్శన చేయాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటన చేసినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. పశ్చిమ పసిఫిక్‌లో జపాన్‌తో కలిసి అమెరికా ప్రస్తుతం నేవీ దళ బల ప్రదర్శనను చేయబోతోంది. ఈ మేరకు ఇప్పటికే జపాన్‌కు చెందిన రెండు యుద్ధ నౌకలు కూడా అమెరికా యుద్ధ నౌకతో చేరాయి.

ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఉత్తర కొరియా జలాల్లోకి వెళ్లి కాపుకాసి అదును చూసి దెబ్బకొట్టండంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాకు చెందిన కార్ల్‌ విన్సన్‌ అనే నేవీ యుద్ధ నౌకకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పలు అణ్వాయుదాలతోపాటు యుద్ధ విమానాలను మోసుకుంటూ ప్రస్తుతం ఈ నౌక పశ్చిమ పసిఫిక్‌ జలాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధికారిక పార్టీ పత్రిక రాడంగ్‌ సిన్మున్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ‘మా విప్లవ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకే దెబ్బతో అణ్వాయుధాలతో ఉన్న అమెరికా నౌకను ఒకే దెబ్బకు ధ్వంసం చేసి ముంచివేసేందుకు రెడీగా ఉన్నాయంటూ అందులో హెచ్చరించింది.

మరిన్ని వార్తలు