శవాలతో ఎగ్జిబిషన్‌

12 Apr, 2018 19:39 IST|Sakshi

సిడ్ని : ఈ ఎగ్జిబిషన్‌లోకి అడుగు పెట్టగానే మనషుల శవాలు స్వాగతం పలుకుతాయి. శరీర భాగాలు మిమ్మల్ని భయపెడతాయి. మన​ శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది. అవయవాలు ఎలా పనిచేస్తాయి. ఏ పని చేసినపుడు ఏ కండరం కదులుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవచ్చు.

ఏకంగా 20 శవాలు, 200లకు పైగా విడి శరీర భాగాలను ప్రదర్శనలో ఉంచారు. సిడ్నీ నగరంలో మనషుల శవాలతో, శరీర భాగాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనిషి శరీర భాగాల పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై ఓ అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్ధేశమని నిర్వాహకులు తెలిపారు. 

డాక్టర్లు చెప్పిన శవాల సంగతులు..
ఈ ప్రదర్శనలో ఉంచిన శవాలను చక్కగా తీర్చిదిద్దిన డాక్టర్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు ఆ శవాలు ఇష్టపూర్వకంగా ప్రదర్శనకు ఇచ్చినవి కావని, అవి చైనాకు చెందిన ఓ నిషేధిత ఫాలున్‌ గాంగ్‌ తెగకు చెందినవిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. వారందరూ మరణ శిక్ష విధించబడిన ఖైదీలు అయ్యిండొచ్చన్నారు. వారిని తీవ్రంగా హింసించడం వల్లే వారు మరణించారని తెలిపారు.

ప్రదర్శన నిర్వాహకుడు టామ్‌ జాలర్‌ మాట్లాడుతూ.. శవాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికి ఈ శవాల ప్రదర్శనను చూడ్డానికి ప్రజలు మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు.  

మరిన్ని వార్తలు