‘రియల్’ ట్రంప్ కార్డ్..

3 Jun, 2016 01:15 IST|Sakshi
‘రియల్’ ట్రంప్ కార్డ్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌తో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్ పేరు గత కొన్ని నెలలుగా మార్మోగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టకముందే.. ఆయన మన దేశంలో అడుగుపెట్టేశారు. ఆ విషయం మీకు తెలుసా? అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు ఎగరేసుకుపోతున్నారంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా విమర్శించిన ట్రంప్.. మన దేశంలో వ్యాపార అవకాశాలను తన్నుకుపోవడంలో మాత్రం ముందుంటున్నారు. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ముంబై, పుణేల్లో అత్యంత విలాసవంతమైన అకాశహర్మ్యాలను నిర్మిస్తోంది. అవి కూడా అత్యంత సంపన్నుల కోసం మాత్రమే. ముంబైలో నిర్మిస్తున్న 75 అంతస్తుల ఆకాశహర్మ్యం ‘ట్రంప్ టవర్’ తాలూకు ఊహాచిత్రమే ఇది. రెండేళ్లుగా దీని పనులు కొనసాగుతున్నాయి.

రపంచంలో తన కంపెనీ ఎక్కడ ఆకాశహర్మ్యాలు కట్టినా.. దానిపై ట్రంప్ టవర్ అని చెక్కించుకోవడం ఆయనకు అలవాటు. ఇక్కడా అలాగే చేయనున్నారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో  నిర్మిస్తున్న ఈ ఆకాశహర్మ్యంలో వాటర్‌ఫాల్స్, స్విమ్మింగ్‌పూల్, స్పాలు వంటి విలాసవంతమైన సౌకర్యాలతోపాటు సొంత క్రికెట్ మైదానం, అథ్లెటిక్ ట్రాక్ కూడా ఉంటుందట. అంతేకాదు.. తన అపార్టుమెంట్లో ఉన్నవారికి ఉచిత ప్రైవేటు జెట్ రైడ్స్‌ను కూడా అందిస్తారట. భారత్‌లో ఇలాంటి సదుపాయం మరెక్కడా లేదని చెబుతున్నారు. ఏడు అంచెల భద్రత వ్యవస్థ ఉండే ఈ ఆకాశహర్మ్యం నిర్మాణ పనులను లోథా గ్రూపు చేపడుతోంది.

2018లో నిర్మాణం పూర్తవుతుంది. మొత్తం 400 ఫ్లాట్స్ ఉంటాయి. త్రీ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.9.1 కోట్లు కాగా.. ఐదు బెడ్రూంల ఫ్లాట్ ధర రూ.10.5 కోట్లు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గోవాలోనూ ట్రంప్ టవర్స్ నిర్మించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారట.

మరిన్ని వార్తలు