లేటవ్వొచ్చేమో.. రావడం మాత్రం పక్కా!

19 Mar, 2019 13:10 IST|Sakshi

జొహాన్నెస్‌బర్గ్‌: ఓట్ల పండగొస్తే అది అనకాపల్లైనా ఆఫ్రికా అయినా గుళ్లో ఉండే దేవుడి కంటే గల్లీలో ఉండే ఓటరు దర్శనానికే నాయకులు క్యూ కడతారు. ఓటరు మహాశయుడిని కలిసి వారి సుఖదుఃఖాలు తెలుసుకుంటారు. మేమున్నామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజధానిలో ఉండే నేతలు కూడా వాడవాడకూ, ఇంటింటికీ తిరగాల్సిందే. ప్రజలను కలసి హామీల మాయా మూటలు అప్పజెప్పాల్సిందే. లేదంటే ఓటరు మనసు మారిపోదూ!.. అలా అయిన పక్షంలో ప్రాణం కంటే ఖరీదైన ఓటు జారిపోదూ..! అసలు వివయంలోకి వస్తే మన దేశంలోలాగే భగభగ ‘మండే’లా దక్షిణాఫ్రికాలోనూ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సౌతాఫ్రికా అధ్యకుడు సిరిల్‌ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా రాజధానికి దగ్గరలోని మబోపనే టౌన్‌షిప్‌ను సందర్శించారు.

ప్రచార అనంతరం మబోపనే నుంచి రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ రైలు రాక కోసం రామఫొసా గంటసేపు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైలు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రిటోరియా స్టేషన్‌కు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు ఆగిపోయింది. ఆ టైమ్‌లో ఆయనతో ఉన్న విలేకరులు ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌ అయ్యాయి.

దక్షిణాఫ్రికాలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు సోషల్‌ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్‌ రైల్‌ ఏజెన్సీ ఆఫ్‌ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్‌ సర్కార్‌ పట్టించుకోవపోవడం పాపమని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

ప్రయాణానంతరం ప్రిటోరియాకు చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రామఫొసా ’’రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామ’’ని అన్నారు. 400 సీట్లున్న సౌతా​ఫ్రికా పార్లమెంట్‌లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా రామఫొసో పార్టీ వ్యూహాలు రచిస్తోంది.   

మరిన్ని వార్తలు