అణు యుద్ధం వస్తే..?

28 Feb, 2019 20:45 IST|Sakshi

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగివుండటంతో యుద్ధం వస్తే వీటిని ప్రయోగించే అవకాశం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం వద్దని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. ‘సే నో టు వార్‌’ అంటూ సోషల్‌ మీడియాలో నినదిస్తున్నారు. అణు యుద్ధం వస్తే సర్వనాశనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌, పాకిస్థాన్‌ అణు యుద్ధానికి దిగితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీద ఉంటుందని అమెరికాలోని కొలరాడొ బౌల్డర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ టూన్‌ వెల్లడించారు. అణు యుద్ధం ప్రభావంపై 35 ఏళ్లు అధ్యయనం చేసి గతేడాది డెన్వర్‌లో ‘టెడ్‌ఎక్స్‌ టాక్‌’లో ఆయన ప్రసంగించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అణ్వాయుధాలు ప్రయోగించడానికి ఒక్క అపార్థం చాలని అన్నారు. భారత్‌-పాకిస్థాన్‌  మధ్య అణు యుద్ధం వస్తే 200 కోట్ల మంది ఆకలితో మరణిస్తారని నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత ఇరా హెల్‌ఫాండ్‌ అంచనా వేసినట్టు వెల్లడించారు. పూర్తిస్థాయిలో అణు యుద్ధం వస్తే పంటలు పండని పరిస్థితులు దాపురిస్తాయని, 90 శాతం మంది ప్రజలు ఆకలితో చనిపోతారని వివరించారు. ఈ వీడియో ట్విటర్‌లో విస్తృతంగా షేర్‌ అవుతోంది.

అణ్వాయుధాల దుష్ప్రరిణామాలపై రెడ్‌క్రాస్‌ సొసైటీ అంతర్జాతీయ కమిటీ కూడా ఒక వీడియో రూపొందించింది. నిమిషం నిడివివున్న ఈ వీడియోలో నిర్ఘాంతపరిచే వాస్తవాలను కళ్లకు కట్టింది. అణ్వాయుధాలను నిషేధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

మరిన్ని వార్తలు