సరిహద్దుల్లో శరణార్థులు !

1 May, 2018 22:19 IST|Sakshi

రోడ్ల మీదే పడిగాపులు

ఉన్న ఊరు పొమ్మంటోంది. నిలువ నీడ లేకుండా చేస్తోంది. చీటికి మాటికి ఎన్నికలతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, గంటకో హత్యతో వీధుల్లో నెత్తుటి ఏళ్లు, ఎటు చూసినా హింసాత్మక వాతావరణం, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గృహహింసతో వాళ్లంతా పొట్ట చేత పట్టుకొని అమెరికాకు బయల్దేరారు. మధ్య అమెరికాలోని హోండరస్, ఎల్‌ సల్వాడర్‌ వంటి దేశాల నుంచి మార్చి 25న 400 మంది వలసదారులు మూటముల్లె సర్దుకొని పిల్లా పాపలతో బతుకు తెరువు వెతుక్కుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. నెల రోజుల పాటు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి కొంత దూరం కాలినడకన, మరికొంతదూరం వాహనాల్లో ఎలాగైతేనేం అమెరికా, మెక్సికో సరిహద్దులకి చేరుకున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ వీరికి సహకారం అందించడమే కాదు, అమెరికాలో ఆశ్రయానికి చట్టపరంగానే అనుమతులు కోరింది.

కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితులతో వాళ్లని సరిహద్దుల్లోనే అధికారులు నిలిపివేశారు. ఒక్క వంతెన దాటితే చాలు, వాళ్లకి నిశ్చింతగా ఆశ్రయం దొరికి ఉండేది, కానీ అమెరికా అధికారులు వాళ్లపై పిడుగులాంటి వార్త పడేశారు. ఇప్పటికే పరిమితికి మించి శరణార్థుల్ని దేశంలోకి అనుమతినిచ్చామని, కొత్త వాళ్లకి ఇక ప్రవేశం కష్టమేనని అధికారులు తేల్చేశారు. అలా ఆశ్రయం కోరి వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉండడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చిన్న పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలీక, ఎవరి దగ్గర తలదాచుకోవాలో అర్థం కాక ఆ వంతెన దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. రోడ్ల మీదే నిద్రపోతున్నారు. అమెరికా ఆశ్రయం ఇచ్చేవరకు తాము ఈ ప్రాంతం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పేశారు. 

శరణార్థులపై ట్రంప్‌ కఠిన వైఖరి
డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుంచే మెక్సికో నుంచి వచ్చే వలసలపై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు. వారంతా రేపిస్టులు అని, సరిహద్దుల్లో గోడ కట్టేస్తానంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆశ్రయం కోరి వచ్చిన వారిపై కఠిన వైఖరినే అవలంబిస్తున్నారు. మధ్య అమెరికా దేశాల నుంచి శరణార్థుల ప్రయాణం ప్రారంభమైన దగ్గర్నుంచే ట్రంప్‌ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. దేశ భద్రతను దెబ్బతీయడానికే స్మగ్లర్లు, నేరచరిత్ర ఉన్నవారే తమ తమ దేశంలోకి చొచ్చుకు వస్తున్నారని,  వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలంటూ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి ట్రంప్‌  ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి శరణార్థులకు ఎక్కువగా ఆశ్రయం ఇస్తున్న దేశం అమెరికాయే. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆశ్రయం కోరవచ్చు. వారు శరణార్థుల గత చరిత్రని పరిశీలించాక అనుమతిలిస్తున్నాయి. తర్వాత తర్వాత నెమ్మదిగా వారు అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందుతున్నారు.  గత ఏడాది ఆఖరి మూడు నెలల్లోనే 30 వేల మంది శరణార్థులు తమకు ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకోగా వారిలో 20 వేల మంది వరకు అక్రమంగానే దేశంలోకి ప్రవేశించారు. ఇలా ఒక ప్రవాహంలా వస్తున్న శరణార్థులపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుర్భరమైన పరిస్థితుల్ని తప్పించుకోవడానికో,  బతుకు తెరువు కోసమో కాకుండా  మంచి ఉద్యోగాలు చేసి లగ్జరీ లైఫ్‌ కోసమే వారంతా వస్తున్నారని, అలాంటి  వారికి ఎందుకు ఆశ్రయం ఇవ్వాలంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

తల్లీ బిడ్డల్ని వేరు చేస్తున్నారు 
శరణార్థుల్ని  భయభ్రాంతులకి లోను చేస్తే  అమెరికా వైపు కూడా కన్నెత్తి కూడా చూడరని ట్రంప్‌ ప్రభుత్వం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. సరిహద్దుల్లోనే తల్లిదండ్రుల నుంచి వారి బిడ్డల్ని వేరు చేస్తోంది. ఆ బిడ్డలు ఎంత పసివాళ్లు అన్నది కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పత్రాలు లేవనో, మరేదో సాకు  చూపించి పసిగుడ్డుల్ని కూడా బలవంతంగా తల్లిదండ్రుల నుంచి లాక్కొని హోమ్స్‌కి తరలిస్తున్నారు. గత ఏడాది హోంల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శిగా పని చేసిన జాన్‌ ఎఫ్‌ కెల్లీ తొలిసారిగా ఈ వ్యూహాన్ని అమలు చేశారు. అక్రమ వలసల్ని అడ్డుకోవాలంటూ వైట్‌ హౌస్‌ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే తాము ఇలాంటి చర్యలకు దిగుతున్నామంటూ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ సమర్థించుకుంటోంది. గత కొన్ని నెలల్లోనే వందల సంఖ్యలో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేశారు. వలసదారుల్ని అడ్డుకోవడానికి ఇలా బిడ్డల్ని వేరు చేస్తే, ఆ చిన్నారులపై మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

మరిన్ని వార్తలు