నా పుస్తకంలో అన్నీ వాస్తవాలే: రెహమ్‌ ఖాన్‌

16 Jun, 2018 10:34 IST|Sakshi
రేహమ్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫొటో)

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఐ ఇన్‌సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ ఆత్మకథపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తన పుస్తకం‘ టెల్‌-ఆల్‌’లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలేనని ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక వేత్త, జర్నలిస్టు అయిన రెహామ్‌ ఖాన్‌ ఏఎన్‌ఐ తో మాట్లాడుతూ.. ‘నా ఆత్మకథ నుంచి కొన్ని విషయాలు బహిర్గతమై వివాదాస్పదమయ్యాయి. కానీ అవన్నీ వాస్తవాలే. అందరికీ నిజాలు తెలియాలనే ఈ పుస్తకాన్ని రాసాను. ఈ పుస్తక విడుదల విషయంలో నాకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి.  కానీ నేను వాటికి భయపడే వ్యక్తిని కాదు’ అని తెలిపారు. 

తన పుస్తకం ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోందని, ముఖ్యంగా వైఫల్యాలను ఎలా అధిగమించాలో తెలియజేస్తోందన్నారు. ‘ఈ పుస్తకంలో నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని రాసుకొచ్చాను. నా బాధలు, ఒడిదుడుకులు, వాటిని ఎలా అధిగమించాననే విషయాన్ని పేర్కొన్నాను. నా పుస్తకం చదివిన తర్వాత చాలా మంది మహిళలకు వారి జీవితంలోని కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఇతరులకు జరగవద్దని కోరుకుంటున్నాను. వైఫల్యాలను ఎలా అధిగమించాలో ఈ పుస్తకం తెలియజేస్తోంది. దీనిలో మొత్తం నా జీవిత  ప్రయాణం వివరించాను. నా జర్నలిజం లైఫ్‌, యాంకర్‌గా మారడం, గ్లామరస్‌ లైఫ్‌ అన్ని విషయాలు ప్రస్తావించాను. చాలా నిక్కచ్చిగా అన్ని విషయాలు పేర్కొన్నాను. ఈ పుస్తకం పట్ల భయపడుతున్నావారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా జీవితం గురించే మాత్రమే.’ అని చెప్పుకొచ్చారు.

ఈ పుస్తకంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని పేర్కొనడం.. వసీం అక్రమ్‌ సతీమణి గురించి రాసిన విషయాలు బయటకి రావడం తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్‌లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు