డెంగ్యూ దోమపై విజయం

3 Aug, 2018 03:02 IST|Sakshi

ఆస్ట్రేలియాలో డెంగ్యూరహిత పట్టణాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు

లండన్‌: పరిశోధకులు చేపట్టిన ఓ ప్రయోగం వల్ల డెంగ్యూ రహిత పట్టణం ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితం డెంగ్యూ వైరస్‌ను అదుపు చేసేందుకు దోమల్లో ప్రవేశ పెట్టిన వోల్బచియా బ్యాక్టీరియా ప్రయోగం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ దీవిలో 66 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న టౌన్స్‌విల్లే వేదికైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు దోమల్లో వోల్బచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి ఇతర దోమలతో జత కూడేలా చేయడంతో డెంగ్యూ వైరస్‌ను నివారించగలిగారు. 2014 నుంచి టౌన్స్‌విల్లేలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు.

ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న డెంగ్యూ, జికా వ్యాధులను అదుపు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశోధన మొదలు పెట్టామని, ఈ ఫలితాలతో తమకు నమ్మకం పెరిగిందని వరల్డ్‌ మస్కిటో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ స్కాట్‌ ఓ నీల్‌ చెప్పారు. ప్రస్తుతం వీటిని ఇండోనేషియాలో ప్రయోగిస్తున్నారు. జికా వైరస్‌ను నివారించేందుకు వీటిని బ్రెజిల్‌ రాజధాని రియో డీ జెనీరోలో ప్రయోగించనున్నారు. ‘టౌన్స్‌విల్లే కన్నా రెట్టింపు విస్తీర్ణం, 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న రియోలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేం విజయం సాధిస్తాం’ అని నీల్‌ అన్నారు. ఈ బ్యాక్టీరియా మలేరియాను నివారించగలదా అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు