హెచ్‌-1బీ వీసాల గడువు : ఊరట

27 Sep, 2018 19:43 IST|Sakshi

హెచ్‌-1 బీ వీసాదారులకు ఊరట

గడువు ముగిసినా ఇబ్బందిలేదు

వాషింగ్టన్‌: హెచ్‌1-బీ వీసాపై భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ఈ వీసా గడువు పొడిగింపుపై ఇటీవల కఠిన నిబంధనల నేపథ్యంలో దాఖలైన పిటీషన్లపై ఫెడరల్‌ ఏజెన్సీ వీసాదారులకు ఉపశమనం కలిగించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఫెడరల్ ఏజెన్సీ ఉద్యోగ సంబంధ దరఖాస్తులు, మానవీయ అర్జీలు, పిటిషన్ల దరఖాస్తులకు ఈ కొత్త నియమం వర్తించదని తెలిపింది. హెచ్‌1-బీ వీసాలపై అక్కడకు వెళ్లిన విదేశీయులు.. వీసా గడువు తీరిపోయిన తర్వాత ఎక్కువ కాలం అక్కడ కొనసాగకుండా నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం(అక్టోబర్‌1) నుంచి దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.

ఈ నిబంధన ప్రకారం.. వీసా గడువు తీరిపోయిన వారు వీసా పొడిగింపు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల అవి తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోని వారిని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఇంకా దేశంలోనే ఉన్నట్లయితే వారిని మాత్రమే దేశం నుంచి బహిష్కరించే నిబంధన అక్టోబరు 1నుంచి అమలు చేసేందుకు అమెరికా సిద్ధమైంది.

అయితే కొత్త నిబంధన మాత్రం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లకు, దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న వాళ్లకు వర్తించదు. అయితే ఈ కొత్త నిబంధన అమలు ప్రభావం భారతీయుల విూదే ఎక్కువగా పడనుంది. సాధారణంగా వీసా గడువు తీరిన తర్వాత సగటున 240రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి.  అలా కాకుండా అనధికారికంగా అక్కడే ఉండిపోతే..యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌(యూఎస్‌సీఐఎస్‌) ‘నోటీస్‌ టు అప్పియర్‌(ఎన్‌టీఏ) జారీ చేస్తుంది. దీంతో సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. కేవలం విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఆవ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు.

వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు. వీసా గడువు పెంచుకోవడానికి లేదా, తమ స్టేటస్‌ మార్పుకోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి ఎన్‌టీఏ నోటీసులు జారీ చేయరు. సుమారు 7లక్షలమంది భారతీయులు హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు