నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యం

16 Nov, 2014 00:47 IST|Sakshi
నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యం

జీ 20 సదస్సులో భారత ప్రధాని మోదీ స్పష్టీకరణ
వెలికితీతకు  అంతర్జాతీయ సహకారం అవసరం
బ్లాక్‌మనీకి, దేశాలెదుర్కొంటున్న భద్రతాసవాళ్లకు సంబంధం ఉంది
ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలి   ప్రజలే కేంద్రంగా సంస్కరణలుండాలి
 దేశాలన్నీ ఒకే వ్యూహాన్ని అమలు చేస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమే.
 ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ వ్యాఖ్య
 
 

బ్రిస్బేన్: భారతీయులు అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి భారత్‌కు తెప్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రపంచదేశాల సహకారాన్ని ఆశిస్తున్నామని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లకు, నల్లధనానికి సంబంధం ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాహారం ‘జీ 20’ తొమ్మిదవ శిఖరాగ్ర సదస్సులో శనివారం ప్రధాని ప్రసంగించారు. ప్రపంచ అతిరథ, మహారథ నేతలు పాల్గొంటున్న ఈ సదస్సులో మోదీ పాల్గొనడం ఇదే ప్రథమం.

 

పన్నుల ఎగవేతకు బహుళ జాతీయ కంపెనీలు లక్సెంబర్గ్‌తో పన్ను తగ్గింపు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో  జీ 20 సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును బ్రిస్బేన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ప్రారంభించారు. ప్రపంచ జీడీపీకి అదనంగా 2 లక్షల కోట్ల డాలర్లను, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో 2% అదనపు వృద్ధిని, లక్షలాది ఉద్యోగాల కల్పనను.. సాధించే దిశగా ఈ సదస్సు దారులు వేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సదస్సు వేదికపైకి వెళ్తున్న నేతలకు ఆస్ట్రేలియా ఆదివాసీలు సంప్రదాయ పాటలు, నృత్యాలతో స్వాగతం పలికారు. సదస్సు ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న నేతలందరికీ కరచాలనంతో స్వాగతిస్తున్న ఆస్ట్రేలియా అబ్బాట్‌ను.. ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.


 ‘బ్రిక్స్’ నేతలతోనూ అదేమాట


 సదస్సు సందర్భంగా జరిగిన ‘బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణా్రఫ్రికా)’ దేశాధినేతల అనధికారిక భేటీలోనూ మోదీ నల్లధనం అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రపంచదేశాల మధ్య లోతైన సమన్వయం అవసరమని వారికి నొక్కి చెప్పారు. భద్రతాపరమైన సవాళ్లకు, నల్లధనానికి ఉండే సంబంధాలను వివరించారు. బ్లాక్‌మనీని భారత్‌కు తిరిగి రప్పించే విషయంలో కట్టుబడి ఉన్నట్లు మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చెబుతున్న విషయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నల్లధనాన్ని వెలికితీసే లక్ష్యంతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
 దొంగచాటు సంస్కరణలు వద్దు.. సదస్సు ప్రారంభం కావడానికన్నా ముందు శనివారం మధ్యాహ్నం క్వీన్స్‌లాండ్ పార్లమెంట్ హాల్లో జీ 20 దేశాధినేతలకు అబ్బాట్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. సహాయకులు లేకుండానే దేశాధినేతలు ఆ విందులో పాల్గొన్నారు.  మోదీ మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ‘సంస్కరణలకు కచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. రాజకీయ ఒత్తిళ్ల నుంచి సంస్కరణలకు రక్షణ కల్పించాలి. సంస్కరణలు ప్రజల మార్గనిర్దేశంలో కొనసాగాలే కానీ దొంగచాటుగా కాదు. ప్రజలే కేంద్రంగా, ప్రజలే నిర్దేశకులుగా సంస్కరణల ప్రక్రియ రూపొందాలి.  సంస్కరణలంటే ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రజలపై భారమని అపోహలున్నాయి. వాటిని తొలగించాలి’ అన్నారు.

 

ప్రభుత్వ ప్రక్రియలను సంస్కరణలు సులభతరం చేయాలని, ఆ దిశగా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని మోదీ సూచించారు. ‘సంస్కరణలనేవి నిరంతరం వివిధ దశల్లో కొనసాగుతూనే ఉంటాయి. సాంకేతికత సాయంతో, సమస్యలను గుర్తిస్తూ, వాటిని పరిష్కరిస్తూ సంస్కరణలను వ్యవస్థీకరించాలి’ అని సంస్కరణలపై తన దృక్పథాన్ని అగ్రదేశాల అధినేతలకు మోదీ వివరించారు. జీ 20 నేతల అనధికార భేటీలో సంస్కరణలపై తన సునిశిత అభిప్రాయాల్ని వెల్లడించాల్సిందిగా మోదీని అబ్బాట్ కోరారని.. అక్బరుద్దీన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
 
 మనసు విప్పి మాట్లాడండి.. విందు సందర్భంగా ఎబాట్ మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో కీలక మార్పును సాధించే బృహత్తర బాధ్యత జీ 20 దేశాధినేతలపై ఉందన్నారు. భూమిపై ఇంకెక్కడా ఇంతకుమించిన ప్రభావశీల బృందం లేదు’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మొక్కుబడిగా కాకుండా.. హృదయంతో, మనఃస్ఫూర్తిగా ప్రసంగించాలని జీ 20 దేశాధినేతలను కోరారు. విందులో మోదీ, ఒబామా, తాను ఉన్న ఒక సరదా సందర్భాన్ని ఎబాట్ విం దు అనంతరం ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచ దేశాలన్నీ ఒకే విధమైన ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తే అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమేనని మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలండ్‌తో భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌పై పోరును అమెరికా తీవ్రతరం చేయనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
 నేటి ‘జీ20’ నుంచి పుతిన్ ‘వాకౌట్’ !
 
 బ్రిస్బేన్: ఉక్రెయిన్ అంశంపై ఎదురైన పశ్చిమ దేశాల నిరసన, ఉక్రెయిన్‌లో వేర్పాటు వాదులను సమర్థించే వైఖరి మారకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవన్న పశ్చిమదేశాల హెచ్చరికల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ఆదివారం జీ20 శిఖరాగ్ర సదస్సు నుంచి వాకౌట్ చేసే అవకాశాలున్నాయని పుతిన్ సలహాదారు ఒకరు తెలిపారు. రెండవ రోజు ఆదివారం పుతిన్ సదస్సుకు హాజరైనా, మధ్యాహ్న భోజనం, విలేకరులతో మాట్లాడే కార్యక్రమంలో పాల్గొనబోరని రష్యా వర్గాలు తెలిపాయి.  తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాద ఘర్షణల్లో తమకు ఏలాంటి ప్రమేయం లేదని రష్యా వాదిస్తుండగా, ఈ అంశంపై రష్యా వైఖరి సరికాదంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా ప్రధాని స్టేఫెన్ హార్పర్, బ్రిటన్ ప్రదాని డేవిడ్ కేమరాన్ వాదిస్తున్నారు.  కాగా,  జీ20 సదస్సుకు సంబంధించి పుతిన్ తాజా నిర్ణయంపై ఆతిథ్యదేశం ఆస్ట్రేలియాగానీ, అమెరికా తదితర ప్రతినిధి వ ర్గాలనుంచి వెంటనే ఎలాంటి స్పందనా వ్యక్తంకాలేదు.
 
  మోదీ.. ఊపిరి సలపనంత బిజీ..
 
 న్యూఢిల్లీ: మూడు రోజులు... ఎనిమిది ద్వైపాక్షిక సమావేశాలు... దేశాల అధినేతలతో చర్చోపచర్చలు... మయన్మార్ పర్యటనలో ప్రధాని మోదీ కాలంతో పరుగులు తీశారు. మూడు దేశాల పర్యటనలో ముందుగా... ఆసియాన్, తూర్పు ఆసియాన్ సదస్సుల్లో పాల్గొనేందుకు మోదీ ఈ నెల 11న మయన్మార్ రాజధాని నేపితాలో అడుగుపెట్టారు. 18 దేశాల అధినేతలు ఇక్కడికి రాగా, అందరిలోకీ బిజీ నేత మోదీయే.
 
 11న నేపితాకు వచ్చిన వెంటనే మోదీ మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్‌తో భేటీ అయ్యారు.


 మరుసటి రోజు ఆసియాన్ సదస్సు సందర్భంగా థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా, మలేసియా ప్రధాని నజీబ్ తున్ రజాక్, బ్రూనే చక్రవర్తి హస్సనాల్ బోల్కియా, సింగపూర్ ప్రధాని లీ హసీన్‌లూంగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు.
 
 13న తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా రష్యా ప్రధానిమెద్వదేవ్, చైనా ప్రధాని  కియాంగ్‌తో భేటీ అయ్యారు. చైనా ప్రధానితో మోదీ సమావేశం కావడం ఇదే ప్రథమం. తర్వాత ఇండోనేసియా  అధ్యక్షుడు జోకో విదోదోను కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
 
 జీ-20 సమావేశం కోసం మోదీ 14న  బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ వీలు చేసుకుని యూరోపియన్ యూనియన్‌ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.  
 
 అదే రోజు బ్రిటన్ , జపాన్ ప్రధానులతో భేటీ అయ్యారు. శనివారం అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్‌లతో భేటీ అయ్యారు. జీ-20  సందర్భంగా మోదీ జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, స్పెయిన్ ప్రధాని రాజోయ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌తోనూ సమావేశాల్లో పాల్గొననున్నారు.
 
 చివరిగా మోదీ ఈ నెల 19న ఒక రోజు పర్యటన కోసం ఫిజీ దేశానికి వెళ్లనున్నారు.

>
మరిన్ని వార్తలు