వారి హత్యకు రష్యా సుపారీ ఇచ్చింది: అమెరికా

27 Jun, 2020 13:37 IST|Sakshi

వాషింగ్టన్‌: అఫ్గనిస్తాన్‌లోని తమ సైనిక బలగాలను హతమార్చేందుకు తాలిబన్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్న ఉగ్రవాదులకు రష్యా మిలిటరీ సుపారీ ఇచ్చిందని అగ్రరాజ్యం అమెరికా నిఘా వర్గాలు తేల్చాయి. ఓవైపు తాలిబన్లతో శాంతి చర్చలు జరుగుతుండగానే.. అమెరికాతో పాటు అఫ్గన్‌లోని సంకీర్ణ, పాశ్చాత్య దళాలను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తేలిందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు కొద్ది మొత్తం డబ్బు ముట్టజెప్పినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపాయి. ఉద్రికత్తలు పెంచేందుకే మాస్కో ఈ విధంగా వ్యవహరించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ శుక్రవారం కథనం ప్రచురించింది. కాగా ఉగ్రవాదులతో పోరాడే క్రమంలో గతేడాది అఫ్గనిస్తాన్‌లో దాదాపు 24 మంది అమెరికా సైనికులు మరణించిన విషయం విదితమే. (విగ్రహాల ధ్వంసం:‌ ట్రంప్‌‌ కీలక నిర్ణయం)

అయితే అమెరికా నిఘా వర్గాలు రష్యాపై చేసిన ఆరోపణలకు ఈ మరణాలకు సంబంధం ఉందా అన్న విషయంపై మాత్రం పూర్తిగా స్పష్టత లేదు. ఇక ఈ విషయంపై స్పందించాల్సిందిగా రాయిటర్స్‌ ప్రతినిధులు అమెరికా గూఢాచార సంస్థ, శ్వేతసౌధ అధికారులను కోరగా వారు ఇందుకు నిరాకరించారు. కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లతో ఈ ఏడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. అంతేగాక జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి షరతు విధించింది. కాగా ప్రస్తుతం అఫ్గాన్‌లో దాదాపు 8 వేల అమెరికా బలగాలు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు