నేపాల్‌ సంక్షోభం: చైనా, పాక్‌ కుట్రలు!

2 Jul, 2020 16:51 IST|Sakshi

నేపాల్‌లో గూఢాచారులను నియమించిన చైనా!?

న్యూఢిల్లీ: నేపాల్‌ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చైనా, పాకిస్తాన్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు సమాచారం. హిమాలయ దేశంలో భారత్‌ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారీ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. నేపాల్‌కు సుదీర్ఘ కాలంగా మిత్ర దేశంగా ఉన్న భారత్‌కు వ్యతిరేకంగా.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా పట్టుబట్టారు. 

ఈ నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి గురువారం అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ముఖ్యనేత, మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్‌ దహల్‌), దేశ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా బలూవాటర్‌లోని ప్రధాని నివాసంలో కేబినెట్‌ కూడా సమావేశమైందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను నిలిపివేసి, పార్లమెంటును ప్రొరోగ్‌ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. (నేపాల్‌ ప్రధానికి అండగా ఇమ్రాన్‌ ఖాన్‌!?)

వైద్య సహాయం పేరిట నేపాల్‌లో తిష్ట!
మరోవైపు... తాజా పరిణామాలపై చర్చించేందుకు కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొనడంతో.. చైనా తన గూఢాచారులను అక్కడ మోహరించినట్లు భారత భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఓలికి మద్దతుగా నిలిచే క్రమంలో కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వైద్య సహాయం పేరిట డ్రాగన్‌ ఇప్పటికే తన వేగులను నేపాల్‌కు పంపించినట్లు పేర్కొన్నాయి. 

ఇక జీ న్యూస్‌ కథనం ప్రకారం.. చైనా ఇంటలెజిన్స్‌ ఏజెన్సీ మిలిటరీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ(ఎంఎస్‌ఎస్‌) నేపాల్‌లో తన ఉనికిని పెంచుకుంటోంది. నేపాల్‌కు సంబంధించిన కీలక వ్యవహారాల గురించి ఇప్పటికే రహస్యాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా విదేశీ సమాచారాన్ని రాబట్టడంలో ఎంఎస్‌ఎస్‌ దిట్ట అంటూ పలువరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. చైనా మిత్రదేశం పాకిస్తాన్‌ సైతం ఓలికి మద్దతు ప్రకటించింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈరోజు ఓలితో ఫోన్‌లో మాట్లాడేందుకు అధికార వర్గాలు షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. (ఆ నిర్ణయాన్ని సరిచేసుకోవాలి: చైనా)

మరిన్ని వార్తలు