వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!

2 Apr, 2019 12:46 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం  భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్‌ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది.

ఇక ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ హేటీస్‌ సెనీజ్‌ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ)

కాగా సౌదీకి చెందిన జమాల్‌ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలతోనే వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్ట్‌ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అ‍ందించడం గమనార్హం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు