జిన్‌పింగ్‌పై కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసలు!

8 May, 2020 09:53 IST|Sakshi
కిమ్‌ జోంగ్‌ ఉన్‌- జిన్‌పింగ్‌(ఫైల్‌ ఫొటో)

మహమ్మారిపై విజయం సాధించారు.. శుభాకాంక్షలు

ప్యాంగ్‌యాంగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో విజయం సాధించినందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఉత్తర కొరియా సుప్రీం లీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అభినందించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో జిన్‌పింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతమైన పాత్ర పోషించిందని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు కిమ్‌ ఆయనకు మౌఖిక సందేశం పంపించారని ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. ‘‘మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించినందుకు జిన్‌పింగ్‌కు కిమ్‌ శుభాభినందనలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సమర్థుడైన జిన్‌పింగ్‌ నాయకత్వంలోని చైనీస్‌ పార్టీ, ప్రజలు వైరస్‌పై పైచేయి సాధించారని కొనియాడారు’’అని తన కథనంలో పేర్కొంది. (అల్ప సంతోషం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: జిన్‌పింగ్‌)

కాగా జనవరిలోనూ కిమ్‌ జిన్‌పింగ్‌కు తన సందేశాన్ని పంపించిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో చైనాకు అండగా ఉంటామన్న కిమ్‌.. తాము ఏవిధంగా సహాయపడబోతున్నామో మాత్రం స్పష్టం చేయలేదు. ఇక తాజా సందేశం కూడా ఆయన ఎప్పుడు, ఎలా పంపారన్న విషయంపై స్పష్టత లేదు. గత కొన్నిరోజులుగా కిమ్‌ ఆరోగ్యం విషమించిందనే వార్తల నేపథ్యంలో ఇటీవలే ఆయన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తన సోదరి కిమ్‌ యో‌ జాంగ్‌‌తో కలిసి ఎరువుల ఫ్యాక్టరీకి వచ్చి రిబ్బన్‌ కట్‌ చేశారు. అయితే ఆ ఫొటోలను తీక్షణంగా గమనించిన కొంతమంది నెటిజన్లు.. సదరు కార్యక్రమానికి హాజరైంది కిమ్‌ కాదని.. ఆయన తన డూప్‌ అంటూ వివిధ ఫొటోలు షేర్‌ చేశారు. కిమ్‌ పాత ఫొటోలు.. ప్రస్తుత ఫొటోలు సరిపోల్చుతూ ఊహాగానాలకు తెరతీశారు.  (మొన్న కనబడింది నకిలీ కిమ్‌, మరో కొత్త వాదన!)

మావో సూట్, మారిన హెయిర్‌స్టైల్‌

మరిన్ని వార్తలు