నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణం; వారికి 6 మిలియన్‌ డాలర్లు?!

24 Jul, 2019 16:04 IST|Sakshi

వాషింగ్టన్‌ : చంద్రుడిపై తొలి అడుగు పెట్టిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. 2012లో అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించిన విషయం తెలిసిందే. హృద్రోగంతో ఓహియోలోని ఓ ఆస్పత్రిలో చేరిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌(82).. సర్జరీ అనంతరం చోటుచేసుకున్న సైడ్‌ ఎఫెక్ట్‌ కారణంగా మృతి చెందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. అదే విధంగా ఈ విషయం గురించి నీల్‌ కుటుంబ సభ్యులకు ముందే తెలుసునని... ఈ మేరకు నీల్‌ మరణం తర్వాత రావాల్సిన పరిహారంపై అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది. సర్జరీ విఫలమైన నేపథ్యంలో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు... హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌లతో భాగస్వామ్యమైన సదరు ఆస్పత్రి వారికి దాదాపు 6 మిలియన్‌ డాలర్ల మేర పరిహారం చెల్లించినట్లు సంచలన కథనం వెలువరించింది.

ఈ ఒప్పందం ప్రకారం నీల్‌ ఇద్దరు కుమారులకు కలిపి 5.2 మిలియన్‌ డాలర్లు, అతడి సోదరీసోదరులకు 2 లక్షల యాభై వేల డాలర్లు, అదే విధంగా అతడి ఆరుగురు మనుమలకు 24 వేల డాలర్లు, వీరి న్యాయవాదికి లక్షా అరవై వేల డాలర్లు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన నీల్‌ భార్య కరోల్‌కు మాత్రం ఒక్క డాలర్‌ సహాయం కూడా అందలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

కాగా ఈ వార్తలపై స్పందించిన సదరు ఆస్పత్రి అధికార ప్రతినిధి.. నీల్‌ కుటుంబ సభ్యులు,  ఆస్పత్రి యాజమాన్యం మధ్య జరిగిన చట్టబద్ధమైన ఈ ఒప్పందాన్ని బహిర్గతపరచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ మేరకు వార్తా సంస్థ ది అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఆమె మెయిల్‌ పంపారు. ఇక 50 సంవత్సరాల క్రితం అనగా, 1969, జూలై 16వ తేదీన అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రముఖ హ్యోమగామి మైఖేల్‌ కాలిన్స్‌ తన ఇద్దరు సహచరులైన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌తో కలిసి ‘అపోలో11’లో చంద్ర మండల యాత్ర సాగించిన సంగతి తెలిసిందే. చంద్ర మండలానికి మహత్తరమైన మానవుడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి గత మంగళవారం నాటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాసా కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో స్వర్ణోత్సవాలను నిర్వహించింది.

మరిన్ని వార్తలు