ఆ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది!

11 Jun, 2020 17:47 IST|Sakshi

కరోనా విజృంభణ: తాజా పరిశోధనలు- వివరాలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. సామాజిక ఎడబాటు, మాస్కు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి నిబంధనలు పాటిస్తున్నా.. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినపుడే మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు ఆ పనిలో తలమునకలై ఉండగా.. మరికొన్ని దేశాలు క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నివారణా మార్గాలు, తాజా అధ్యయనాల్లో వెల్లడైన కీలక అంశాలు- వివరాలు ఇలా ఉన్నాయి.

ఉష్ణోగ్రత, ఆర్ధ్రత ప్రభావితం చేస్తాయి
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న, పొడి ప్రదేశాల్లోని ఉపరితలాలపై కరోనా వైరస్‌ జీవితకాలం తక్కువగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా కరోనా సోకిన వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు పొడిబారిన వెంటనే బలహీనపడిపోతాయని తేలింది. ఈ మేరకు... ‘‘బహిరంగ ప్రదేశాల్లో ఉపరితలాలకు అంటుకున్న వైరస్‌ కణాల జీవితకాలం ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అవి పొడిబారే సమయం వైరస్‌ ఉనికిపై ప్రభావం చూపుతుంది’’అని పిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. 

ఈ విషయం గురించి పరిశోధకులు రజనీశ్‌ భరద్వాజ్‌ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘తక్కువ ఉష్ణోగ్రతలు, అధిక ఆర్ద్రత ఉన్న ప్రదేశాల్లో వైరస్‌ చురుగ్గా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్లు, చెక్క ఉపరితలాలను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. గాజు, స్టీల్‌ ఉపరితలాలతో పోలిస్తే వాటిపైనే వైరస్‌ ఎక్కువ సేపు బతికి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దగ్గు లేదా తుమ్ముల ద్వారా సదరు ఉపరితలాలపై పడిన నీటి బిందువులు బొట్టు లాంటి ఆకారాలు ఏర్పరుస్తాయి. ఇవి అంత తొందరగా ఆవిరైపోవు. వైరస్‌ తన ఉనికిని కాపాడుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి’’అని తమ మాథమెటికల్‌ మోడల్‌లో నిరూపితమైందన్నారు.

సీ- సెక్షన్‌ ప్రమాదకరం!
సిజేరియన్‌ డెలివరీ వల్ల మహిళలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని స్పెయిన్‌ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. స్వల్ప అనారోగ్యంతో బాధ పడుతున్న దాదాపు 78 మంది తల్లులను పరీక్షించగా.. సిజేరియన్‌ కోసం 37 మంది ఐసీయూలో చేరారని.. నార్మల్‌ డెలివరి జరిగిన వారితో పోలిస్తే వీరిలో వైరస్‌ లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. అధిక ఒత్తిడి, సర్జరీ వీరి విషయంలో ప్రమాదకర అంశాలుగా పరిణమించాయని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

ఆరుగురు కరోనా పేషెంట్లకు ఒకే వెంటిలేటర్‌!
మహమ్మారి వ్యాప్తి చెందిన తొలినాళ్లలో ఐసీయూలు పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. అమెరికాలోని పలు ఆస్పత్రుల్లో ముఖ్యంగా న్యూయార్క్‌లో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు పేషెంట్లకు ఒక వెంటిలేటర్‌ చొప్పున ఉపయోగించామని.. అయితే రాను రాను పేషెంట్ల తాకిడి ఎక్కువ కావడంతో ఆరుగురికి ఒకే వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. నిపుణుల పర్యవేక్షణలోనే వెంటిలేటర్‌ షేరింగ్‌ జరిగిందని.. అయితే ఇది అన్నివేళలా శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. పేషెంట్‌ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును అనుసరించి అతడికి ట్రీట్‌మెంట్‌ అందించే విధానం ఆధారపడి ఉంటుందని తెలిపారు. డిమాండ్‌కు తగిన విధంగా సప్లై లేని సమయంలో తాము ఈ టెక్నిక్‌ ఉపయోగించినట్లు వెల్లడించారు.

ఆ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోంది!
కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనాలో వ్యాక్సిన్‌ అభివృద్ధి దిశగా ఇప్పటికే పలు ప్రయోగాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా తాము రూపొందించిన బీబీఐబీపీ-కోర్‌వీ వ్యాక్సిన్‌ కోతులు, ఎలుకలు, పందులు, కుందేళ్లకు రెండేసి డోస్‌ల చొప్పున ఇంజెక్ట్‌ చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ ప్రతిరక్షకాలను అధిక సంఖ్యలో అభివృద్ధి చేయడమే కాకుండా ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్ చూపడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం ఇప్పటికే దాదాపు వెయ్యి మంది పార్టిసిపెంట్స్‌ ముందుకు వచ్చారని తెలిపారు.

రెమిడిసివిర్‌ ఉపయోగించండి!
కరోనా సోకిన కోతులకు యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడిసివిర్‌ ఇవ్వగా సానుకూల ఫలితాలు వచ్చాయని మకావు పరిశోధకులు వెల్లడించారు. ఈ ఔషధం ఊపిరి తిత్తుల వ్యాధిని పూర్తిగా నయం చేసిందని.. కోవిడ్‌-19 పేషెంట్లలో నిమోనియాను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నారు. 12 కోతులపై పరీక్షలు నిర్వహించగా వాటి శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగుపడిందన్నారు. ఈ మేరకు నేచర్‌ జర్నల్‌లో తమ అధ్యయనానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. 

మరిన్ని వార్తలు