ఇరాక్‌ గ్రీన్‌జోన్‌లోకి దూసుకొచ్చిన రాకెట్లు

9 Jan, 2020 08:40 IST|Sakshi

 అమెరికా ఎంబసీ లక్ష్యంగా రాకెట్‌ దాడి!

హషీద్‌ గ్రూపులపై సందేహాలు

బాగ్దాద్‌: ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడులతో ఇరాక్‌ దద్దరిల్లుతోంది. తమ జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్‌... ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై బుధవారం క్షిపణులు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ గ్రీన్‌జోన్‌లోకి రెండు రాకెట్లు దూసుకువచ్చాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కలిగి నిత్యం భద్రతా సిబ్బంది నిఘాలో ఉండే ఈ ప్రాంతంపై కత్యూష రాకెట్ల దాడి జరగడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాక్‌కు చెందిన హషీద్‌ గ్రూపు(ఇరాక్‌లోని పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్సెస్)లే ఈ దాడికి పాల్పడినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు

ఇక ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్‌ దాడికి పాల్పడి.. ఇరాన్‌ జనరల్‌ సులేమానిని హతమార్చింది. ఈ దాడిలో సులేమానితో పాటు ఇరాక్‌ మిలిటరీ కమాండర్‌ అబూ మహ్ది అల్‌- ముహందీస్‌తో పాటు మరికొంత మంది అధికారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ కమాండర్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హషీద్‌ గ్రూపులు ప్రకటించాయి. ఇరాక్‌ పారా మిలిటరీ చీఫ్‌ ఖైస్‌ అల్‌- ఖాజిలీ(అమెరికా ఇతడిని ఉగ్రవాదిగా బ్లాక్‌లిస్టులో పెట్టింది) మాట్లాడుతూ..‘ఇరాన్‌ ప్రతీకారం కంటే ఇరాక్‌ ప్రతీకారం ఏమాత్రం తక్కువగా ఉండబోదు’ అని వ్యాఖ్యానించాడు.(రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే)

ఇక సిరియాలో కీలకంగా వ్యవహరించే ఇరాక్‌ పారామిలిటరీ గ్రూపు హర్కత్‌ అల్‌- నౌజాబా సైతం...‘ అమెరికా సైనికులారా మీరు కళ్లు మూసుకోకండి. అమరుడైన ముహందీస్‌ కోసం ఇరాకీలందరూ చేతులు కలుపుతారు. మీరు ఇరాక్‌ను వదిలివెళ్లేంత వరకు ప్రతీకారంతో రగిలిపోతారు’ అని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హషీద్‌ గ్రూపులే బుధవారం అర్ధరాత్రి అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా కత్యూష రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. (ఇరాన్‌ క్షిపణుల వర్షం.. అమెరికా శాంతి మంత్రం)

మరిన్ని వార్తలు