అమెరికాలో మళ్లీ కాల్పులు!

14 Jun, 2016 23:31 IST|Sakshi
అమెరికాలో మళ్లీ కాల్పులు!

అమారిలో: ఆర్లెండోలోని నైట్‌ క్లబ్బులో జరిగిన దారుణమైన కాల్పుల ఉదంతం మరువకముందే మళ్లీ అమెరికాలో కాల్పుల మోత మోగినట్టు తెలుస్తోంది. టెక్సాస్‌ అమారిలోలోని వాల్‌మార్ట్‌ వద్ద ఓ సాయుధుడు  కాల్పులతో కలకలం రేపాడు. సాయుధుడి చేతిలో పలువురు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం మానుకోవాలని, ట్రాఫిక్‌ మీద దృష్టి పెట్టడం కన్నా సంఘటన స్థలంలో పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అమారిలో పోలీసు విభాగం సూచించింది. వాల్‌మార్ట్‌ స్టోర్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తుపాకులతో వీరంగానికి దిగినట్టు తెలుస్తున్నదని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ కాల్పుల బారిన పడలేదని, కాల్పుల వల్ల ఎవరు గాయపడ్డట్టు సమాచారం లేదని అమారిలో పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగడం లేదని వెల్లడించారు. సాయుధుడి ఆధీనంలో ఉన్న బందీలంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.

ఆర్లెండోలోని ఓ గే నైట్‌క్లబ్బులో రెండ్రోజుల కిందట ఓమర్‌ మతీన్‌ ఉన్మాదీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్స్‌ క్లబ్బులో పార్టీలో మునిగితేలిన యువకులపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 49మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశీయ ఉగ్రవాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టెక్సాస్‌లోని అమారిలోలో కాల్పులు చోటుచేసుకోవడం అమెరికన్లు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

 

మరిన్ని వార్తలు