టాక్స్‌ బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం

20 Dec, 2017 12:55 IST|Sakshi


వాషింగ్టన్‌: వివాదాస్పద పన్ను సంస్కరణల  బిల్లు ఫైన్‌ కాపీని  అమెరికన్‌ సెనేట్‌ ఎట్టకేలకు ఆమోదించింది.  దీంతో  అమెరికా చట్టసభల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ తన పట్టును  మరోసారి నిరూపించుకున్నారు.  టాక్స్‌ కట్‌, జాబ్స్‌ యాక్ట్‌ బిల్లు కు హౌస్‌లో తుది ఆమోదం తరువాత వైట్‌ హౌస్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

కార్పొరేట్‌ ట్యాక్స్‌ను ప్రస్తుత 35 శాతం నుంచి 21 శాతం వరకూ తగ్గించే ప్రతిపాదనలతో కూడినది ఈ పన్ను సంస్కరణల బిల్లు.  ఇది భారీ విజయమని అధికారి పక్ష సభ్యులు హర‍్షం వ్యక్తం చేయగా...బిల్లుఆమోదం సందర్భంగా సభలో ప్రతిపక్షల సభ్యుల  కిల్‌ ద బిల్‌ నినాదాలు మిన్నంటాయి. 12 మంది రిపబ్లికన్ సభ్యులు దీనిని వ్యతిరేకించగా డెమొక్రాట్లు ఓటు వేయలేదు.

కాగా 1.5 ట్రిలియన్‌ డాలర్ల(రూ. 96.7 లక్షల కోట్లు ) పన్ను ప్రణాళిక బిల్లుపై అధికార రిపబ్లికన్లలో కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు పలు ఆర్థిక వేత్తలు, నిపుణులు కూడా   ప్రతికూల అభిప్రాయాలను  వెల్లడించారు. అమెరికా ప్రజల ఆదాయాల్లో కనిపించే అసమానతలను ఇవి తగ్గించకపోగా, మరింత పెంచుతాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తుండడంతో  ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది.
 

మరిన్ని వార్తలు