అ'మెరికలు' కావాలి!

13 May, 2018 01:12 IST|Sakshi

     అమెరికాలో కావాల్సినన్ని ఉద్యోగాలు 

     అదే స్థాయిలో నిరుద్యోగుల సంఖ్య కూడా.. 

     కంపెనీలకు నైపుణ్యం ఉన్నకార్మికుల కొరత 

అగ్రరాజ్యం అమెరికా.. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన పదేళ్ల నాటి పరిస్థితి నుంచి ఆ దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో నేడు నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించడానికి అవసరమైన ఖాళీలున్నాయి. మార్చి నెలలో రికార్డు స్థాయిలో 66 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని అమెరికా కార్మిక శాఖ ఇటీవల వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం ఆ నెలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు 66 లక్షల మందే ఉన్నారు. దేశంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని ఎంయూఎఫ్‌జీ యూనియన్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త క్రిస్‌ రూప్కీ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి దేశంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగ ఖాళీలపై కార్మిక శాఖ నెలనెలా లెక్కలు సేకరిస్తుండగా ప్రతి నిరుద్యోగికి మార్కెట్‌లో ఓ ఖాళీ ఉండటం మార్చి లోనే మొదటిసారని తేలింది. వైట్‌ కాలర్‌ ఉద్యోగాలే ఉండే వ్యాపారాలు, నిర్మాణరంగం, గోదాముల కంపెనీలు మార్చి నెలలో ఉద్యోగాల భర్తీ ప్రారంభించాయి. ఆర్థిక పరిస్థితులు ఇలా మెరుగవుతూ ఉంటే భవిష్యత్తులో ఉద్యోగార్థుల సంఖ్య కంటే ఉద్యోగ ఖాళీల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు. ఏప్రిల్‌ నెలలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 64 లక్షలకు పడిపోయింది. ఉద్యోగాల భర్తీ వేగం పుంజుకోవడం లేదు. తమ సంస్థల్లో ఖాళీలున్నా వాటికి అవసరమైనంత నైపుణ్యమున్న కార్మికులు దొరకడం లేదని పలు కంపెనీల ఉన్నతాధికారులు బాధపడుతున్నారు. 

ఉద్యోగాలున్నా ఎందుకీ నిరుద్యోగం? 
అమెరికాలో గత 20 ఏళ్లలో నిరుద్యోగం అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఉపాధి దొరకని ఆఫ్రికన్‌ అమెరికన్లు(నల్లజాతి వారు), హిస్పానిక్‌ అమెరికన్ల సంఖ్య ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి చేరింది. పెరిగిన ఉద్యోగుల అవసరం దృష్ట్యా కంపెనీలు కూడా తమ నియామక పద్ధతుల్లో మార్పులు తెచ్చాయి. కాలేజీ డిగ్రీ లేనివారు, నేరచరిత్ర కలిగి కొంత కాలం జైళ్లలో గడిపినవారిలో సమర్థులుంటే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఇవి వెనుకాడటం లేదు. నిరుద్యోగుల సంఖ్యలోనే ఉద్యోగ ఖాళీలుంటే కోరుకున్నవారందరికీ ఉపాధి దొరకాలి. కానీ, ఆర్థికాభివృద్ధి జరుగుతున్న కాలంలో సైతం అలా జరగడం లేదు. అమెరికా వంటి సంపన్నమైన పెద్ద దేశంలో జనం తమ ఉద్యోగాలు మానేసి, కొత్త ఉద్యోగాల్లో చేరడానికి సమయం తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత ఉద్యోగాలతో విసుగు చెంది వాటిని వదిలేసినవారి సంఖ్య మార్చిలో 30 లక్షలు దాటింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో చేరడానికి తగినన్ని నైపుణ్యాలు ఉద్యోగార్థులందరి దగ్గరా లేవు. అదీగాక, తాము నివసించే ప్రదేశాల్లోనే ఉద్యోగం కోరుకునే ధోరణి పెరగడంతో నిరుద్యోగులకు తమ సొంతూళ్లలో ఉపాధి దొరకడం లేదు. ఫలితంగా, ఉద్యోగ ఖాళీలు త్వరగా భర్తీకావడం లేదు. అందుకే ప్రతిభాపాటవాలున్న వారికి ఎక్కువ జీతం ఇవ్వడానికి, నైపుణ్యం తగినంత లేనివారికి శిక్షణ ఇవ్వడానికి అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నా నియామకాలు జోరందుకోవడం లేదు. కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య పెంచుతున్నారేమోగాని వాటిలో నియామ కాలు జరపకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

అంతంత మాత్రంగానే పెరుగుతున్న వేతనాలు
అగ్రరాజ్యంలో వేతనాల పెరుగుదల కూడా అంతంత మాత్రమే. కిందటేడాది జీతాలు ఎప్పుడూ లేనంత తక్కువగా 2.6 శాతమే పెరిగాయి. లారీలు, రైలు రవాణా రంగాల్లో పనిచేసే బ్లూకాలర్‌ కార్మికులకు బోనస్‌ వంటి చెల్లింపులు పెరిగాయిగాని, ఒకసారి మాత్రమే ఇచ్చే చెల్లింపులు కావడంతో నిజ వేతనాలు పెరగనట్టే లెక్క. స్థానికులైన అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్యోగాల్లో చేరాలనుకునే కొత్తవారికి శిక్షణతో కూడిన ఉపాధి కల్పించాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. కార్మికులకు శిక్షణ అనేది ఖర్చుతో కూడిన వ్యవహారమేగాక, చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమాలు దేశంలో అమల్లో లేవు. కార్మికశాఖ చెబుతున్న సంఖ్య కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ముఖ్యంగా పనిచేయడానికి అనువైన వయసులో ఉన్న వారు ఉపాధి లేకుండా చాలా మంది ఉన్నా వారు ప్రభుత్వ లెక్కల్లో చేరలేదని కూడా నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు