కేన్సర్ నిర్ధారణకు కాగితపు పరీక్ష!

26 Feb, 2014 01:31 IST|Sakshi
కేన్సర్ నిర్ధారణకు కాగితపు పరీక్ష!

వాషింగ్టన్: మూత్రం, రక్తం నమూనాలను ఓ కాగితంపై వేసి.. రంగుల్లో మార్పులను బట్టి వ్యాధులను నిర్ధారించే పద్ధతులు ఇదివరకే వచ్చాయి. అయితే కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడే కాగితపు పరీక్షను మిట్ ప్రొఫెసర్, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సంగీత భాటియా అభివృద్ధిపర్చారు. కేన్సర్ కణాల నుంచి ప్రొటీన్లను విడగొట్టే నానోపార్టికల్స్ మందును రోగి శరీరంలోకి పంపించి, మూత్రపరీక్ష చేస్తే  కేన్సర్‌ను తొలిదశలోనే సులభంగా గుర్తించవచ్చు. నైట్రోసెల్యులోజ్ కాగితంతో తయారుచేసిన కాగితపు పట్టీ (స్ట్రిప్)లో.. వివిధ రకాల కేన్సర్ కణతుల నుంచి విడుదలయ్యే ప్రొటీన్‌లను గుర్తించే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు పొందుపర్చారు. రోగుల మూత్రం నమూనాను పట్టీపై వేయగానే.. కేన్సర్‌కు సంబంధించిన ప్రొటీన్లు ఉంటే గనక.. కాగితంపై ఆయా గీతలు ప్రత్యక్షమవుతాయి. దీంతో ఏ రకమైన కేన్సర్ వ్యాధి ఉందో నిర్ధారణ చేసుకుని, తొలిదశలోనే చికిత్స తీసుకునేందుకు వీలవుతుందని భాటియా వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం నిపుణుల అవసరం లేకుండానే ఈ పరీక్ష చేయవచ్చని, ప్రస్తుతం రోగుల చర్మం కింద అమర్చేందుకు ఉపయోగపడే నానోపార్టికల్ పదార్థాన్ని తయారు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు