సూపర్‌ హీరో... రిచర్డ్‌ స్టాన్టన్‌

14 Jul, 2018 01:54 IST|Sakshi
బ్రిటన్‌ ఈతగాడు రిచర్డ్‌ స్టాన్టన్‌

థాయ్‌ గుహ ఘటనలో బ్రిటన్‌ డైవర్‌పై ప్రశంసల జల్లు

చియంగ్‌ రాయ్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్‌ గుహ ఘటనలో బ్రిటన్‌ డైవర్‌ రిచర్డ్‌ స్టాన్టన్‌ సూపర్‌ హీరోగా అందరి అభిమానాలు అందుకుంటున్నారు. కోచ్‌ సహా ‘వైల్డ్‌ బోర్స్‌’ సాకర్‌ విద్యార్థుల బృందం.. హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా గుహ లోపల చిక్కుకున్న ప్రాంతా న్ని మొదటగా గుర్తించిన స్టాన్టన్‌.. సహాయక చర్యలు ముమ్మరం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయనిచ్చిన సమాచారం ఆధారంగానే వీరిని కాపాడిన ఆపరేషన్‌ జోరందుకుంది. బ్రిటన్‌ సహా వివిధ దేశాల డైవర్లు చొరవతీసుకుని మూడ్రోజులపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్‌ పూర్తయ్యాక థాయ్‌లాండ్‌ నుంచి బయలుదేరిన స్టాన్టన్‌ శుక్రవారం లండన్‌ చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి.. బాధితులంతా బయటకు వచ్చేంతవరకు జరిగిన రోమాంచిత ఘటనలను ఆయన వివరించారు. 

గుర్తించేందుకే ఆలస్యమైంది! 
జూన్‌ 23న అందరిలాగే థాయ్‌ పాఠశాల విద్యార్థుల ఫుట్‌బాల్‌ బృందం, కోచ్‌ ఎక్కాపోల్‌ చాంథవాంగ్‌తో కలిసి థామ్‌ లువాంగ్‌ గుహలను సందర్శించేందుకు వెళ్లింది. ఇంతలో హఠాత్తుగా గుహను వరద ముంచేయడంతో కోచ్‌ సహా సాకర్‌ చిన్నారుల బృందం తప్పించుకునే ప్రయత్నంలో గుహలోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడాలని థాయ్‌ అధికారులు, డైవర్లు ప్రయత్నించినప్పటికీ.. పిల్లలను గుర్తించడమే పెద్ద సవాల్‌గా మారిందని స్టాన్టన్‌ తెలిపారు. ఘటన జరిగిన 10 రోజుల వరకు వీరంతా ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయామన్నారు. ఆ తర్వాత లోయలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఓ భారీ రాయి వెనక వీరున్నట్లు తను గుర్తించినట్లు ఆయన తెలిపారు.  లోయలో చిన్నారులను తొలిసారి చూసినపుడు ఒక్కరొక్కరిని లెక్కబెడుతూ.. 13 మంది ఉన్నారని నిర్ధారించుకున్నాకే హమ్మయ్య అనిపించింది’ అని స్టాన్టన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు