లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు

21 Apr, 2020 16:58 IST|Sakshi

పారిస్‌ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం శివారులో సోమవారం ఉదయం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. యువకులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి టపాకాయలు కాలుస్తూ పోలీసులపైకి, గాలిలోకి విసిరారు. పారిస్‌ పోలీసులు భాష్ప వాయువును ప్రయోగిస్తూ లాఠీ చార్జీ చేస్తూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందుకు యువత తిరగబడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో విధించిన లాక్‌డౌన్‌ను మే 11వ తేదీ వరకు పొడిగిస్తూ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఉత్తర్వులు జారీ చేయడంతోనే పారిస్‌ యువతలో అసహనం పెరిగిపోయింది.

సోమవారం తెల్లవారు జామున ఓ పోలీసు వ్యాన్‌ ఢీకొని 30 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడడంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. రెచ్చిపోయిన యువకులు కొన్ని ప్రాంతాల్లో పోలీసులపైకి రాళ్లు రువ్వినట్లు కూడా తెలుస్తోంది. పారిస్‌లో ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది కరోనా బారిన పడగా వారిలో దాదాపు 400 మంది మరణించారు.

వైరస్‌ ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్‌ఓ

మరిన్ని వార్తలు