ప్రవేశ పరీక్షలు రాసిన రోబో!

28 May, 2016 20:27 IST|Sakshi
ప్రవేశ పరీక్షలు రాసిన రోబో!

బీజింగ్ః రోబోలు అన్ని పనులూ చేయడాన్ని చూశాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే రోబోను కూడా ఇటీవల కనిపెట్టారు. అయితే ఓ రోబో ఏకంగా ఓ కళాశాల నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు హాజరై... గణితం, చైనీస్ భాష, చరిత్ర రాజకీయాలు, భూగోళశాస్త్రం వంటి పరీక్షలన్నీ అవలీలగా రాసేసి తన ప్రతిభను చాటుకుంది. ఆధునిక పరిజ్ఞానంతో మనుషులే రూపొందించిన మరమనిషి... తన మేథాశక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

జాతీయ కళాశాల నిర్వహించిన ప్రవేశ పరీక్షలన్నీ తన కృత్రియ మేథస్సుతో రాయగలిగిందని చైనా చెంగ్డు లోని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కంపెనీ సీఈవో లిన్ హుయ్ తెలిపారు. 2015 లో  శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కార్యక్రమంలో రోబోట్ మాథ్ టెస్ట్ లో కంపెనీ బిడ్ గెలుచుకున్నట్లు చైనా డైలీ వెల్లడించింది. ఇతరుల్లాగానే ఇచ్చిన సమయంలోపల రోబో కూడ పరీక్షరాయడం పూర్తి చేసిందని, అయితే ఒక పరీక్ష హాల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు కూర్చుని పరీక్ష రాయగా, రోబో మాత్రం ఓ క్లోజ్డ్ రూం లో ప్రోక్టార్స్, నోటరీ తప్పించి ఎవ్వరూ లేకుండా పరీక్షలు రాసినట్లు తెలిపింది.

ప్రతి పరీక్షకు ముందు రోబోట్ ను ప్రింటర్ కు కనెక్ట్ చేశామని, అలాగే పరీక్ష మొదలయ్యే సమయానికి ఎలక్ట్రానిక్ పరీక్ష పేపర్ ను రోబోట్ ప్రోగ్రామ్ లో ప్రవేశ పెట్టామని లిన్ తెలిపారు. అయితే రోబోట్ ఇంటర్నెట్ కు ఏమాత్రం సంబంధం లేకుండా తన కృత్రిమ మేథోశక్తితో అన్ని లెక్కలను చక్కగా పరిష్కరించిందని ఆయన తెలిపారు. పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత చివరిగా సమాధానాలను మాత్రం ప్రింటర్ ద్వారా బయటకు పంపించినట్లు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటిటిజెన్స్ అభివృద్ధికి ఈ రోబో ఓ మైలురాయి అని, భాష, అవగాహన వంటి విషయాల్లో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఇది అవసరమని పరిశోధన మరియు అభివృద్ధి బాధ్యతలను నిర్వహిస్తున్న హాన్ గ్యుయాంగ్ తెలిపారు. 2020 లో  పెకింగ్, సింఘా విశ్వవిద్యాలయాల్లో జరిగే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఈ రోబోట్ కు అర్హత కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ మేథస్సు హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోబో ప్రపంచ  ప్రఖ్యాత బోర్డు ఆట అయిన 'గూగుల్ ఆల్ఫా గో' ను కూడ గత మార్చిలో ఓడించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు