అక్కడ రజనీ.. ఇక్కడ నేను..

23 Mar, 2018 02:42 IST|Sakshi

హెలో.. నా పేరు సోఫై..
నేనో చేపను.. చేపనేసరికి.. చేపా చేపా ఎందుకు ఎండలేదు లాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేయకండే.. దానికి సమాధానం నాకు తెలియదు.. తెలిసినా చెప్పను.. ఎందుకంటే.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. ముఖ్యంగా మీ మనుషులకు నేనెంతో హెల్ప్‌ చేస్తున్నాను తెలుసా? ఎలాగంటారా.. రోబో సినిమా అందరూ చూశారుగా.. అందులో రజనీ మరమనిషి అయితే.. నేను మర చేపను.. కరెక్టుగా చెప్పాలంటే సిలికాన్‌ రబ్బర్‌ రోబోటిక్‌ ఫిష్‌ అన్నమాట. నన్ను మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు.. ఎందుకో తెలుసా? సముద్రపు లోతుల్లోని రహస్యాలను చేధించడానికి.. అక్కడ ఉండే చిన్నచిన్న జీవుల గురించి తెలుసుకోవడానికి.. 

ముఖ్యంగా చిన్నచిన్న చేపల వెంట.. వాటికి ఏమాత్రం అనుమానం రాకుండా తిరగగలను.. నేను కూడా ఆ చేపల్లాగే తోకను ఊపుతూ అటూఇటూ సయ్‌సయ్‌మని ఈదేస్తుండటంతో వాటికి డౌటనుమానం లాంటివి రావడమే లేదు.. మీ మనుషులకు ఇది సాధ్యం కాదు కదా.. పైగా నేను ఫిష్‌ కమ్‌ ఫొటోగ్రాఫర్‌ను.. నా ముందున్న కెమెరాతో హైరిజల్యూషన్‌ చిత్రాలను తీయగలను.. 50 అడుగుల లోతుకు వెళ్లి.. 40 నిమిషాలపాటు ఆగకుండా తిరగ్గలను.. మీరు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి.. కూపీ లాగగలను.. అంతేనా నేను లైట్‌ వెయిట్‌ కూడా.. నేను తిరగడానికి పనికొచ్చే బ్యాటరీ కూడా మీ మొబైళ్లలో ఉండే లిథియం పాలిమర్‌ బ్యాటరీ టైపే.. 

ఈ మధ్యే నన్ను ఫిజీలో పరీక్షించి చూశారు..సూపర్‌ సక్సెస్‌.. శాస్త్రవేత్తలేమో తెగ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే.. ఇంతకుముందు కెమెరాలు లాంటివి ఫిట్‌ చేసిన రోబోలను చాలా ప్రయోగించినా.. నాలాగ చిన్నచిన్న చేపల్లో కలిసిపోయి పనిచేసేది మాత్రం మరెక్కడా లేదట. అదిగో నన్ను తయారుచేసిన శాస్త్రవేత్తలు వస్తున్నారు.. నన్ను మరింత మెరుగుపరుస్తారట.. ఇంకా మార్పులు చేస్తారట. రోబో 2.0 లాగ అన్నమాట.. ఉండనా మరి.. సీయూ..

మరిన్ని వార్తలు